Home /News /explained /

Coal shortage: విద్యుత్​ సంక్షోభం పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?.. తెలుసుకోండి

Coal shortage: విద్యుత్​ సంక్షోభం పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?.. తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో బొగ్గు కొరత కారణంగా కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు, అనేక విద్యుత్​యేతర పరిశ్రమలు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఉక్కు నుంచి ఆయిల్​ రిఫైనరీల వరకు అనేక విద్యుత్​యేతర పరిశ్రమలు వాటి కార్యకలాపాలకు ముప్పును ఎదుర్కొంటున్నాయి.

భారతదేశం బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. చాలా బొగ్గు ఆధారిత విద్యుత్​ ప్లాంట్లలో కొన్ని రోజుల స్టాక్​ మాత్రమే మిగిలి ఉంది. దీంతో విద్యుత్​ సంక్షోభం ముంచుకొస్తుందని వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. బొగ్గు (Coal) కొరతతో రాబోయే కొద్ది రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో విద్యుత్​(Electricity) కోతలు విధించక తప్పని పరిస్థితి ఎదురవ్వనుంది. భారతదేశంలో 70 శాతం విద్యుత్..​ బొగ్గు ఆధారిత థర్మల్​ విద్యుత్​ పవర్​ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత బొగ్గు కొరతతో 135 బొగ్గు ఆధారిత థర్మల్​ విద్యుత్ ప్లాంట్లలో నాలుగు రోజుల కంటే తక్కువ బొగ్గు నిల్వలు మిగిలి ఉన్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డేటా పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

దేశంలో బొగ్గు కొరత కారణంగా కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు, అనేక విద్యుత్​యేతర పరిశ్రమలు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఉక్కు నుంచి ఆయిల్​ రిఫైనరీల వరకు అనేక విద్యుత్​యేతర పరిశ్రమలు వాటి కార్యకలాపాలకు ముప్పును ఎదుర్కొంటున్నాయి. కరోనా నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్​కు విద్యుత్ సంక్షోభం పెద్ద కుదుపు అని చెప్పవచ్చు. బొగ్గు పంపిణీలో విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనివ్వాలని, పరిస్థితి చక్కబడే వరకు ఇతర పరిశ్రమలకు బొగ్గు కేటాయింపులను తగ్గించాలని కోల్ ఇండియా (Coal India) బుధవారం విడుదల చేసిన ప్రకటనతో విద్యుత్​యేతర పరిశ్రమలు మరింత ఆందోళన చెందుతున్నాయి.

* విద్యుత్​ సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యే కొన్ని కీలక పరిశ్రమలు

* ఇనుము
కొరత కారణంగా బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఇనుము, ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువుల ఉత్పత్తి వ్యయాలు పెరగనున్నాయి. దీంతో ప్రొడక్షన్​ తగ్గనుంది. "2021 జూలై, అక్టోబర్ మధ్య దేశీయ బొగ్గు ధర 15 శాతం పెరిగినప్పటికీ, బొగ్గు దిగుమతి ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం, బొగ్గు ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో సెంటు స్పాంజ్ ఇనుము ఉత్పత్తికి సుమారు USD 75/MT వ్యయం పెరిగింది. బొగ్గు సంక్షభంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది." అని ఐసిఆర్‌ఎ కార్పొరేట్ సెక్టార్ రేటింగ్స్ అసిస్టెంట్ విపిసెక్టార్ హెడ్ రీటాబ్రత ఘోష్ అన్నారు.

* ఉక్కు
కొన్ని పెద్ద పెద్ద ఉక్కు తయారీ సంస్థలకు సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికైతే ఆయా సంస్థలు ఎలాంటి విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు. అయితే బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే వచ్చే రెండు నెలలు ఉక్కు పరిశ్రమలు గడ్డు కాలం ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. “బొగ్గు సంక్షోభంతో ఉక్కు ధరలు కూడా స్పాంజ్ ఇనుము ధరల వలే పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే, 2021 జూలై, అక్టోబర్ మధ్య 11 శాతం స్టీల్​ ధరలు పెరిగాయి. బొగ్గు కొరత కారణంగా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఈ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపనుంది." అని ఘోష్ చెప్పారు.

* ఆయిల్​ రిఫైనరీస్​
బొగ్గు తరువాత, ఆయిల్​ రిఫైనరీస్ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అతిపెద్ద వనరులు. ప్రస్తుతం దేశం బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నందున, ఆయిల్​ రిఫైనరీస్​కు​ డిమాండ్ పెరగనుంది. భారతదేశంలోని అనేక పెద్ద ఆయిల్​ రిఫైనరీస్​ తమ స్వంత క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. కాబట్టి, బొగ్గు కొరత కారణంగా అవి విద్యుత్ కొరతను ఎదుర్కొనే అవకాశం లేనప్పటికీ, పెరిగిన డిమాండ్ ఎల్‌ఎన్‌జి దిగుమతులకు దారితీస్తుంది. దీంతో వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పెరగనున్నాయి. ఒకవేళ, విద్యుత్ కొరత ఏర్పడితే ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్ వంటి చిన్న తయారీ యూనిట్లు డీజిల్ జనరేటర్లను ఉపయోగించి తమ కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. అయితే దేశంలో ఇంధన ధరలు ఇప్పటికే పెరిగినందున వీటి తయారీ ఖర్చు కూడా పెరగనుంది.

* ఫ్రోజన్​ ఫుడ్​
శీతలీకరణ అవసరమయ్యే ఆహార పరిశ్రమ, విద్యుత్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రధాన రంగాల్లో ఒకటి. దేశంలో బొగ్గు కొరత ఏర్పడితే ఈ పరిశ్రమ డీజిల్ జనరేటర్లపై ఆధారపడవచ్చు. అయితే ఇప్పటికే డీజిల్​ ధరలు గరిష్టానికి చేరినందున శీతలీకరణకు అయ్యే ఖర్చులు కూడా పెరగనున్నాయి. విద్యుత్ కొరత పౌల్ట్రీ, మాంసం, పాడి పరిశ్రమలపై కూడా పడనుంది. ఇది గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నాయి.

* ఇటుక బట్టీలు/సిమెంట్
భారతదేశంలో ఎక్కువ ఇటుక బట్టీ, సిమెంట్​ పరిశ్రమలు బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు పెరగడంతో ఈ పరిశ్రమలపై పెను ప్రభావం పడనుంది. ఇటుక బట్టీ పరిశ్రమలు బొగ్గు దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా తయారీ రంగంపై ప్రభావం చూపుతుంది. ఇటుక ధరలు మరింత పెరగనున్నాయి.

Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

* నవంబర్​లో పరిస్థితి మెరుగయ్యే అవకాశం
అనేక విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్​యేతర పరిశ్రమలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, నవంబర్ నుండి ఈ పరిస్థితి మెరుగుపడవచ్చని కార్పొరేట్ సెక్టార్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబ్యసాచి మజుందార్ అన్నారు. "అక్టోబర్ నెలలో బొగ్గు లభ్యత క్రమంగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలు నవంబర్​లో సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంది.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Coal

తదుపరి వార్తలు