తయారీ, పారిశ్రామిక రంగంలో దిగ్గజమని చెప్పుకునే చైనాకు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, సంక్షోభం కారణంగా అక్కడి పారిశ్రామిక రంగం తల్లడిల్లుతోంది. బొగ్గు సరఫరాలో కొరత, కఠినమైన ఉద్గార ప్రమాణాలు, తయారీ రంగం నుంచి విపరీతమైన డిమాండ్ కారణంగా బొగ్గు ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హఠాత్తుగా చైనాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎందుకు ఏర్పడింది? ఏయే పరిశ్రమలపై ఆ ప్రభావం ఉంది? ఈ సంక్షోభంపై బీజింగ్ ఎలా స్పందించింది? ఆ విషయాలన్నీ సమగ్రంగా తెలుసుకుందాం.
* విద్యుత్ సమస్య చైనాలో ఎన్నాళ్లు ఉండవచ్చు?
గృహ విద్యుత్ వినియోగంపై ఇప్పుడే ఆంక్షలు మొదలయ్యాయి. కానీ మార్చి నుంచే అక్కడ విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలను చైనా విపరీతంగా పెంచడంతో పాటు వినియోగంపై ఆంక్షలు విధించడంతో అక్కడి పరిశ్రమలపై పెనుభారం పడుతోంది. మంగోలియాలో ఉన్న ఒక అల్యూమినియం స్మెల్టర్ సహ కొన్ని భారీ పరిశ్రమలు విద్యుత్ వినియోగం తగ్గించాలని చైనా ఇప్పటికే ఆదేశించింది. దక్షిణాది రాష్ట్రమైన గువాంగ్‌డాంగ్‌లోని ఒక ప్రముఖ ఎగుమతి సంస్థకు కూడా విద్యుత్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలనే విజ్ఞప్తులు అందాయి. చైనా తూర్పు తీరంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థల విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించారు.
* చైనాలో ఎనర్జీ టార్గెట్స్ ఎలా ఉన్నాయి? వాటిని ఎందుకు విధించారు?
వాతావరణ మార్పులపై గతేడాది జరిగిన ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. తమ దేశ స్థూల జాతియోత్పత్తిలో ప్రతీ యూనిట్‌కు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తామని లేదా కార్బన్ తీవ్రతను 2005 నాటి స్థాయితో పోల్చితే 2030 నాటికి దాన్ని 65% కంటే ఎక్కువ తగ్గిస్తామని ప్రకటించారు. కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య వాయువులను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే చైనా, తన ఉద్గారాల విడుదలను తగ్గించుకుంటామని చెప్పడం వాతావరణ మార్పుపై చేస్తున్న అంతర్జాతీయ పోరాటంలో కీలకం కానుంది. రెన్యూవబుల్ ఇంధన సామర్ధ్యాన్ని పెంచుకుంటామని జిన్‌పింగ్ ప్రతిజ్ఞ చేసినా ప్రపంచం దృష్టి మాత్రం కార్బన్ తీవ్రతను తగ్గించుకుంటామనే మాటలపైనే నిలిచింది. ఉద్గారాల తగ్గింపు, లక్ష్యాలకు చేరువ కావడమన్నది చైనాలో స్థానిక సంస్థల బాధ్యత.
* జిన్‌పింగ్ ప్రకటన తర్వాత విద్యుత్ వినియోగం తగ్గిందా?
చైనా ప్రధాన ప్రణాళిక సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీఫామ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) లెక్కల ప్రకారం చైనాలోని 30 ప్రధాన ప్రాంతాల్లో 10 మాత్రమే ఈ ఇంధన కోత లక్ష్యాలను 2021 ప్రథమార్థంలో చేరుకున్నాయి. దీంతో అగ్రహించిన ఎన్డీఆర్సీ, లక్ష్యాలు సాధించడంలో విఫలమైన ప్రాంతాల్లో కఠినమైన శిక్షలు విధించింది. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఇంధన డిమాండ్ పరిమితం చేయడంలో విఫలమైన అధికారులు జవాబుదారీగా ఉండాలని సెప్టెంబర్ మధ్యలో ఆదేశాలు జారీ చేసింది.
* లక్ష్యాల కారణంగా 2021లో చైనా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిందా?
2020 ఆగస్టుతో పోలిస్తే.. 2021 ఆగస్టు నాటికి చైనాలో విద్యుత్ ఉత్పత్తి 10.1% అధికంగా జరిగింది. 2019తో పోల్చితే అది దాదాపు 15% ఎక్కువ. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తిని కంపెనీలు పెంచాయి. పెరిగిన విద్యుత్ ఉత్పత్తితో పాటు అధిక విష ఉద్గారాలు పెరిగాయి.
* విద్యుత్ వినియోగాన్ని పరిమితం చేస్తున్నారా?
విద్యుత్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని లేదా ఔట్పుట్ తగ్గించుకోవాలని చైనాలోని జిజియాంగ్, జియాంగ్సు, యూనాన్, గువాంగ్డాంగ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఫ్యాక్టరీలని కోరాయి. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉత్పత్తి నిలిపేయాలని లేదా వారంలో రెండు లేదా మూడు రోజులు పూర్తిగా కార్యకలాపాలు నిలిపేయాలని భారీ వినియోగదారులకు నోటీసులు పంపించాయి. దీంతోపాటు తూర్పు చైనాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్లు సహ అనేక పరిశ్రమలు సెప్టెంబర్ 22 నుంచి మూతపడ్డాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు తెరవకూడదని వాటిని ఆదేశించారు.
* ఎలాంటి పరిశ్రమలపై దీని ప్రభావం పడుతోంది?
అల్యూమినియం స్మెల్టింగ్, స్టీల్, సిమెంట్, ఎరువుల తయారీ పరిశ్రమలపై విద్యుత్ కోత ప్రభావం తీవ్రంగా ఉంది. అటు గృహవినియోగదారులపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ పొదుపు చేసేందుకు వాటర్ హీటర్లు, మైక్రోవేవ్ వంటి వాటిని వినియోగం ఆపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
IT Return: ఆఖరి నిమిషం వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేదా?.. ఫైన్ కట్టాల్సిందే.. ఎంతంటే..
LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా ? ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..
* విద్యుత్ కోతలపై అక్కడి ప్రభుత్వం ఏం చెబుతోంది?
విద్యుత్ కోతల సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తామని ఎన్డీఆర్సీ చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టేది వెల్లడించలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారు అయిన ఆస్ట్రేలియాతో వాణిజ్య వివాదాన్ని చైనా ఎదుర్కొంటోంది. చైనాకు ఎగుమతులను ఆస్ట్రేలియా తగ్గించింది. మరో వైపు చైనా బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాల కారణంగా అధికారులు భద్రతా చర్యలను పెంచడంతో అక్కడ ఉత్పత్తి మందగించింది. కొవిడ్-19 ఆంక్షలు తొలగుతుండటంతో అగ్రదేశాలు సహజ వాయువును విపరీతంగా నిల్వ చేసుకుంటున్నాయి. దీంతో దీనికి అంతర్జాతీయంగా కొరత ఏర్పడుతోంది. అయితే విద్యుత్ సరఫరా సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటామని, అధిక విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతామని చైనా స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, ELectricity