• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • CHENAB BRIDGE ARCH COMPLETED ALL ABOUT THE WORLDS HIGHEST RAILWAY BRIDGE IN KASHMIR MK GH

Chenab arch bridge: ఎన్నో ప్రత్యేకతలున్న చీనాబ్ రైల్వే ఆర్చి బ్రిడ్జి.. ఇంజినీరింగ్ అద్భుతం

చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి

కశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు లోయలో మౌలిక సదుపాయాల కల్పన పనులను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చీనాబ్ నదిపై రూ.1,486 కోట్ల వ్యయంతో రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జి కనీసం వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

  • Share this:
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై అత్యంత ఎత్తులో రైలు మార్గం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రేసీ జిల్లాలోని బక్కల్, కౌరీ ప్రాంతాల మధ్య నిర్మిస్తున్న ఈ ఇంజినీరింగ్ అద్బుతం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మార్గాన్ని కలపనుంది. కశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు లోయలో మౌలిక సదుపాయాల కల్పన పనులను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చీనాబ్ నదిపై రూ.1,486 కోట్ల వ్యయంతో రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జి కనీసం వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదకరమైన గాలుల వల్ల కూడా ఈ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఫ్రాన్స్‌లోని ఐఫిల్ టవర్‌ కంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. నదిపై రైలు మార్గం పూర్తయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైలు ఆగకుండా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

స్టీలు, కాంక్రీట్ మిశ్రమంతో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఆర్చి బ్రిడ్జి కశ్మీర్‌ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తోంది. ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్ల ప్రాంతాలను కలుపుతున్న 111 కిలోమీటర్ల రైల్వే లింక్ ప్రాజెక్టులో ఈ ఆర్చ్ బ్రిడ్జి ఒక భాగం. దీన్ని 2002లో నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించి పనులు చేపట్టారు. భారత్‌లో చేపట్టిన రైల్వే నిర్మాణ పనుల్లో ఇది క్లిష్టమైంది. ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచంలో అత్యంత ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జిగా ఇది రికార్డు సాధించనుంది.

ఎంత దృఢంగా ఉంటుంది?
ఈ బ్రిడ్జి జీవిత కాలం 120 సంవత్సరాలు. భయంకరమైన ప్రకృతి విపత్తులను సైతం ఇది తట్టుకోగలదు. ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్లినా, గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా బ్రిడ్జిపై ఎలాంటి ప్రభావం పడదు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది పాయింట్లుగా నమోదయ్యే భూకంప తీవ్రతను సైతం ఈ రైల్వే బ్రిడ్జి తట్టుకోగలదు. దీనిపై రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

ఇతర ప్రత్యేకతలు
ఈ బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. చీనాబ్ నది మట్టం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉంటుంది. బ్రిడ్జి నిర్మాణానికి 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్, 66,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు అవసరమైంది. ఆర్చి బ్రిడ్జి కోసం ఉపయోగించిన కేబుల్ క్రేన్ పైలాన్ ఎత్తు 127 మీటర్లు. ఇది ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ ఎత్తు (72 మీటర్లు) కంటే ఎంతో ఎక్కువ కావడం విశేషం.

నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు
భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న సెస్మిక్ జోన్-4లో ఈ బ్రిడ్జిని నిర్మించడం ఇంజినీర్లకు ఎంతో కష్టంతో కూడుకున్న విషయంగా మారింది. హిమాలయాల్లో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండే పర్వత శ్రేణుల్లో ఈ మార్గం ఉంది. ఇక్కడ తరచుగా 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. దీనికి తోడు ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాలు, మంచు కారణంగా పనులు ఎప్పటికప్పుడు ఆపాల్సి వచ్చింది. గత రెండున్నర సంవత్సరాలుగా ఇంజినీర్లు కేబుల్ క్రేన్ల సహాయంతో ఈ ఆర్చిని నిర్మిస్తున్నారు.

చినాబ్ నదికి ఇరువైపులా సుమారు 900 మీటర్ల ఎత్తు ఉండే కేబుల్ క్రేన్ల సహాయంతో ఆర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మరో సంవత్సరంలో దీనిపై ట్రాక్ పనులు పూర్తి కానున్నాయి. ఆ తరువాత ఆర్చ్ కి ఆధారంగా ఉంచిన కేబుళ్లను తొలగిస్తారు.
First published: