దేశంలో మలిదశ కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. కొత్త వైరస్ స్ట్రెయిన్ల వ్యాప్తి క్రమంగా ఎక్కువ అవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించాయి. కరోనా ప్రభావం హోలీ పండుగపై కూడా పడుతోంది. ఉత్తర భారతంలో ప్రముఖ పండుగల్లో...
దేశంలో మలిదశ కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. కొత్త వైరస్ స్ట్రెయిన్ల వ్యాప్తి క్రమంగా ఎక్కువ అవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించాయి. కరోనా ప్రభావం హోలీ పండుగపై కూడా పడుతోంది. ఉత్తర భారతంలో ప్రముఖ పండుగల్లో హోలీ ఒకటి. ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. కానీ కరోనా మళ్లీ విస్తరించడంతో ఈ ఏడాది హోలీ వేడుకలు నిర్వహించే అవకాశాలు కనిపించట్లేదు. పండుగ సందర్భంగా విపత్తు నిర్వహణ చట్టంలోని (డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్) సెక్షన్ 22 ప్రకారం ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రాష్ట్రాలు హోలీ వేడుకలపై నిషేధం విధించాయి. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందువల్ల ఆ రాష్ట్రంలో హోలీ, రంగ పంచమి వేడుకలపై ఆంక్షలు విధించారు. ముంబై, పుణె మున్సిపల్ కార్పొరేషన్లలో హోలికా దహనంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు.
దిల్లీలో కూడా..
దిల్లీలో కూడా హోలీ, షబ్-ఎ-బరత్ సహా ప్రజలు గూమికూడే అన్ని పండుగలపై ఆంక్షలు ఉంటాయని దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) ప్రకటించింది. కేసులు పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని షాపింగ్ మాల్స్, మతపరమైన ప్రదేశాలు, మెట్రోలు, సినిమా హాళ్లకు సూచించింది. ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటించేలా చూడటం నిర్వాహకుల బాధ్యత అని అధికారులు తెలిపారు. హరియాణా, ఒడిశా, గుజరాత్, చండీఘడ్ కూడా హోలీ వేడుకలపై నిషేధం విధించాయి.
ఆగని పరీక్షలు
హోలీకి ముందు వివిధ ప్రాంతాల నుంచి తమ రాష్ట్రాలకు వచ్చే వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఉత్తరప్రదేశ్, దిల్లీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విమానాశ్రయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్టేషన్లలో దిగిన వారికి వెంటనే పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఈవెంట్లలో జాగ్రత్తలు
హోలీ వేడుకలపై నిషేధం లేని రాష్ట్రాల ప్రజలు.. ఉత్సవాల సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. పండుగ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో మాస్కులు ధరిండచం, సామాజిక దూరం, ఇతర కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. నిర్వాహకులు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో నిర్వహించే పండుగ వేడుకల్లో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యాలు ఉన్నవారు పాల్గొనకూడదని పాలనా యంత్రాంగాలు ఆదేశించాయి. ప్రజలు ఇళ్లలోనే హోలీ పండుగ చేసుకోవాలని రాష్ట్రాలు ఆదేశించలేదు. కానీ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇదే మంచి మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 22 ఏం చెబుతోంది?
విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం.. రాష్ట్రాల్లో ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించాలి. విపత్తుల గురించి అక్కడి ప్రజలను హెచ్చరించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. విపత్తు నిర్వహణ ప్రణాళికల తయారీ, వాటి అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలి. ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించడంతో పాటు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.