Explained: C.1.2 Variant: కొత్తరకం C.1.2 కరోనా వేరియంట్ అంటే ఏంటి? దీనిపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

కొత్తరకం C.1.2 కరోనా వేరియంట్ అంటే ఏంటి? దీనిపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

Explained: C.1.2 Variant: కొత్త రకం C.1.2 వేరియంట్‌ను ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికాలోని మపుమాలంగా, గౌటెంగ్ ప్రావిన్స్‌లలో మొదటిసారి కనుగొన్నారు. జూన్‌లో దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్, లింపోపో ప్రావిన్స్‌లతో పాటు ఇంగ్లాండ్, చైనాలో కూడా ఈ వేరియంట్‌ బయటపడింది.

  • Share this:
దక్షిణాఫ్రికా (South Africa)లో ఇటీవల కోవిడ్-19 (Covid- 19) కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది వేగంగా ఉత్పరివర్తనం చెందుతూ యాంటీబాడీలు అందించే రక్షణను తప్పించుకునేలా రూపం మార్చుకుంటోందని తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలను దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యునికబుల్ డిసీజెస్ (NICD) వెల్లడించింది. ఈ సంస్థతో కలిసి క్వాజులు- నాటల్ రిసెర్చ్ ఇన్నొవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. C.1.2 వేరియంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే కనుగొన్నారు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని మెజారిటీ ప్రావిన్సులతో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల్లోని ఏడు దేశాలకు ఇది విస్తరించింది. గతంలో గుర్తించిన ఆందోళనకర, దృష్టిసారించాల్సిన వైరస్ రకాలకంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు సీ.1.2 వేరియంట్‌లో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

* C.1.2 వేరియంట్‌ను ముందు ఎక్కడ కనుగొన్నారు?
కొత్త రకం C.1.2 వేరియంట్‌ను ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికాలోని మపుమాలంగా, గౌటెంగ్ ప్రావిన్స్‌లలో మొదటిసారి కనుగొన్నారు. జూన్‌లో దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్, లింపోపో ప్రావిన్స్‌లతో పాటు ఇంగ్లాండ్, చైనాలో కూడా ఈ వేరియంట్‌ బయటపడింది. ఆగస్టు రెండోవారం నాటికి C.1.2 వేరియంట్ కరోనా కేసులను ఆరు దక్షిణాఫ్రికా ప్రావిన్సులతో పాటు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో కనుగొన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

* ఈ వేరియంట్ ప్రత్యేకత ఏంటి?
దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ సమయంలో విజృంభించిన C.1 వేరియంట్‌తో పోలిస్తే C.1.2 వేరియంట్ గణనీయంగా మార్పు చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇతర కోవిడ్-19 వేరియంట్ల కంటే సీ.1.2 వేరియంట్‌ ఉత్పరివర్తన రేటు భారీగా ఉంది. అధ్యయనం ప్రకారం C.1.2 సంవత్సరానికి 41.8 మ్యుటేషన్‌లకు గురవుతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలోని సీ.1.2 జన్యువుల సంఖ్యలో ప్రతి నెలా స్థిరమైన పెరుగుదల ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. మే నెలలో నిర్వహించిన జన్యుక్రమం విశ్లేషణలో ఇది 0.2 శాతంగా ఉండగా.. జూన్‌ నాటికి 1.6 శాతానికి పెరిగింది. జులైలో ఇది రెండు శాతానికి చేరుకుంది.

* C.1.2 వేరియంట్‌లో ఎలాంటి ఉత్పరివర్తనలు ఉన్నాయి?
గతంలో వెలుగుచూసిన C.1 వేరియంట్‌లో కనిపించిన కొన్ని ఉత్పరివర్తనాలు C.1.2లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ORF1ab, స్పైక్, ORF3a, ORF9b, E, M, N ప్రోటీన్లలో అదనపు ఉత్పరివర్తనాలను గుర్తించారు. C.1.2 లో గుర్తించిన అనేక స్పైక్ ఉత్పరివర్తనలు గతంలో గుర్తించిన ఇతర ఆందోళన రకం వేరియంట్లలో కనిపించాయి. అయితే సీ.1.2 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఆందోళన రకం లేదా దృష్టి సారించాల్సిన రకం వేరియంట్‌గా వర్గీకరించలేదు. కేసుల పెరుగుదల, తీవ్రత ఆధారంగా డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని వర్గీకరించే అవకాశం ఉంది.

* కోవిడ్ టీకాలు ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయా?
C.1.2 వేరియంట్‌లోని కొన్ని ఉత్పరివర్తనలు రోగనిరోధక ప్రతిస్పందనను తప్పించుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో కనుగొన్నారు. ఇందులోని అనేక ఉత్పరివర్తనలు మెరుగైన ACE2 బైండింగ్‌తో యాంటీబాడీల న్యూట్రలైజేషన్ శక్తిని తగ్గించే అవకాశం ఉంది. అందువల్ల ఈ వేరియంట్‌ను టీకాలు నిరోధించలేవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వేరియంట్‌పై కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ లేదా టీకా వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల కచ్చితమైన ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

దీనికి సంబంధించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యునికబుల్ డిసీజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వైరస్‌ వేరియంట్‌కు సంబంధించి మరింత డేటా సేకరిస్తామని సంస్థ తెలిపింది. ఈ వేరియంట్‌లోని ఉత్పరివర్తనాల ఆధారంగా.. దీనిపై వ్యాక్సిన్ల ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేసినట్లు పేర్కొంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్లు వివిధ వేరియంట్ల ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి :  వైడ్ ఇవ్వని అంపైర్... కోపంలో పొలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

* దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా?
ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌ వ్యాప్తి గురించి WHO క్రమం తప్పకుండా దక్షిణాఫ్రికా పరిశోధకులతో చర్చిస్తోంది. ఈ ఏడాది జులైలో C.1.2 గురించి దక్షిణాఫ్రికా.. WHO వైరస్ ఎవల్యూషన్ వర్కింగ్ గ్రూప్‌కు సమాచారం అందించింది. కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా C.1.2 వేరియంట్‌కు సంబంధించిన 100 సీక్వెన్సులను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌గా కనిపించట్లేదని చెప్పారు.

ఈ వేరియంట్‌పై నిరంతరం పరిశోధనలు చేస్తున్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలకు డాక్టర్ మరియా కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం C.1.2 వేగంగా వ్యాపిస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ దీని సీక్వెన్సింగ్‌పై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా వేరియంట్‌ సమర్థత, వ్యాప్తి చెందే వేగాన్ని మరింత కచ్చితత్వంతో అర్థం చేసుకోవచ్చు’ అని ఆమె వివరించారు.

ఇది కూడా చదవండి :  కోహ్లీ, పంత్ ర్యాంకులు ఢమాల్.. రోహిత్ శర్మ దూకుడు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..!

* వ్యాప్తి రేటు ఎలా ఉంది?
ఇప్పటివరకు వాప్తి రేటులో ఈ వేరియంట్ ఇతర కోవిడ్ వేరియంట్‌లను అధిగమించలేకపోయింది. ఉదాహరణకు.. ఈ జులైలో దక్షిణాఫ్రికాలోని మొత్తం కరోనా కేసుల్లో C.1.2 వేరియంట్ కేసులు మూడు శాతంగానే ఉన్నాయి. అదే నెలలో ఆ దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి 89 శాతంగా ఉంది. కానీ ఈ వేరియంట్ వేగంగా ఉత్పరివర్తన చెందుతోంది. అందువల్ల ఇది తీవ్రమైన నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ వైద్య చికిత్స విధానాలకు ఈ వేరియంట్ సవాళ్లు విసిరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: