Queen Elizabeth II Birthdays: బ్రిటన్ రాణికి రెండు పుట్టినరోజులు... ఏయే రోజులు? ఎందుకో తెలుసా?
Queen Elizabeth II Birthdays: బ్రిటన్ రాణికి రెండు పుట్టినరోజులు... ఏయే రోజులు? ఎందుకో తెలుసా?
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్
Britain Queen Elizabeth 2 birthday Celebrations: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 రెండుసార్లు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకోండి.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- IIకు ఈ ఏడాదితో 95 సంవత్సరాలు నిండాయి. ఆమె 1926, ఏప్రిల్ 21న జన్మించారు. ఇటీవల రాణి భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ చనిపోవడంతో, ఆమె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోలేదు. కానీ ఇదే సంవత్సరంలో ఆమెకు మరోసారి అధికారికంగా పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. బ్రిటన్ రాణి సంవత్సరంలో రెండు పుట్టినరోజులను నిర్వహించుకుంటుంది. ఎలిజబెత్-II అసలు పుట్టిన తేదీ అయిన ఏప్రిల్ 21న కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుగుతాయి. కానీ రాణి అధికారిక పుట్టినరోజు వేడుకలు జూన్ నెలలో రెండో శనివారం నాడు నిర్వహిస్తారు. బ్రిటీష్ రాజ్యంలో ఇదొక ఆనవాయితీగా వస్తోంది.
బ్రిటన్ రాణి తన అసలు పుట్టినరోజును కుటుంబంతో కలిసి జరుపుకుంటుంది. ఆ రోజు హైడ్ పార్క్‌లో 41-గన్ సెల్యూట్, విండ్సర్ గ్రేట్ పార్క్‌లో 21-గన్ సెల్యూట్, లండన్ టవర్ వద్ద 62-గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. అయితే ఆమె అధికారిక పుట్టినరోజును మాత్రం పెద్ద ఉత్సవంలా ప్రజల సమక్షంలో నిర్వహిస్తారు. రాజవంశస్తుల జన్మదిన వేడుకలను ఆ దేశంలో ‘ట్రూపింగ్ ఆఫ్ కలర్స్ పరేడ్’ పేరుతో ఒక గొప్ప వేడుకలా నిర్వహిస్తారు. బ్రిటిష్ చక్రవర్తుల అధికారిక పుట్టినరోజులను పురస్కరించుకుని ఈ వేడుకను గత 260 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ రాజవంశీయుల అధికారిక జన్మదిన వేడుకలను వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం ఒక సంప్రదాయం. అక్టోబర్లో జన్మించిన బ్రిటన్ రాజు, కింగ్ జార్జ్ IIతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయని నమ్ముతారు.
అధికారిక పుట్టినరోజు వేడుకల పరేడ్‌లో 1400 మందికి పైగా సైనికులు, 200 గుర్రాలు, 400 మంది మ్యుజీషియన్స్ పాల్గొంటారు. బ్రిటన్ రాణి అధికారిక నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి పరేడ్ మొదలవుతుంది. మాల్ నుంచి డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఉన్న వైట్‌హాల్ వరకు హార్స్ గార్డ్స్ పరేడ్ కొనసాగుతుంది. ఆ తరువాత తిరిగి వెనక్కు వస్తుంది. అనంతరం సంప్రదాయ వేడుకలో భాగంగా రాజకుటుంబం మాల్ నుంచి ప్రయాణిస్తుంది. ఆ తరువాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాణి ప్రజలకు అభివాదం చేస్తుంది. ఈ సందర్భంగా బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ బృందం చేసే వైమానిక విన్యాసాల అనంతరం పరేడ్ ముగుస్తుంది. ఈ సంవత్సరం ప్రిన్స్ ఫిలిప్ చనిపోయినందువల్ల రాణి అసలు పుట్టినరోజు నాడు గన్ సెల్యూట్ చేయలేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.