BH Series: వాహనాలకు కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలేంటి?.. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివాసం ఉండేవారికి వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఒక తలనొప్పిగా మారుతుంది.

  • Share this:
ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివాసం ఉండేవారికి వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఒక తలనొప్పిగా మారుతుంది. ఇలాంటి వారు ముందు వాహనాలు రిజిస్టర్ అయిన రాష్ట్రం నుంచి ఒక ఎన్‌ఓసీ పొందాలి. ఆ తర్వాత మారిన రాష్ట్రంలో వాహనానికి రీ-రిజిస్ట్రేషన్ చేయాలి. దీంతోపాటు ఆ రాష్ట్రానికి రోడ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ భారత్ సిరీస్ పేరుతో కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్‌ను(BH Series Registration) కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తరచుగా ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే డిఫెన్స్, రైల్వేలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఉండి, అక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రైవేట్ ఉద్యోగులు తమ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు BH సిరీస్ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకోవచ్చు.

* ప్రస్తుత వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
వేరే రాష్ట్రానికి వెళ్లిన వారు తమ వాహనాలను సైతం తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు.. ప్రస్తుతం వాహనం రిజిస్టర్ చేసిన రాష్ట్రం (పేరెంట్ స్టేట్) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. మరొక రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్‌(New Registration) కోసం ఈ NOC తప్పనిసరి. మోటార్ వాహనాల చట్టం- 1988 లోని సెక్షన్ 47 ప్రకారం.. రీ-రిజిస్ట్రేషన్ చేయని ఒక వాహనం కొత్త రాష్ట్రంలో 12 నెలల పాటు మాత్రమే తిరిగేందుకు అనుమతి ఉంటుంది. ఆ తరువాత అక్కడి రాష్ట్రంలో రీ-రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి.

రీ- రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు పేరెంట్ స్టేట్‌లో చెల్లించిన రోడ్ ట్యాక్స్‌ సైతం ప్రో రేటా బేసిస్ ప్రకారం తిరిగి పొందవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు.. పేరెంట్ స్టేట్‌లో వాహనం రిజిస్టర్డ్ లైఫ్‌ మొత్తానికి ముందుగానే రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 15 సంవత్సరాలుగా ఉంది. అదే వాహనాన్ని ఐదు సంవత్సరాల తర్వాత వేరే రాష్ట్రంలో రీ రిజిస్ట్రేషన్ చేస్తే.. పేరెంట్ స్టేట్ ముందుగా వసూలు చేసిన మొత్తం నుంచి మిగిలిన 10 సంవత్సరాల రోడ్డు ట్యాక్స్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రంలో వాహన యజమాని వాహనం మిగిలిన జీవిత కాలానికి.. అంటే పదేళ్లకు ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

అయితే పేరెంట్ స్టేట్ నుంచి మిగిలిన రోడ్ ట్యాక్స్ వాపసు పొందడానికి సంబంధించిన నిబంధనలు గందరగోళంగా ఉన్నాయి. ఈ రూల్స్ రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. దీనికి తోడు మిగిలిన రహదారి పన్నును రాష్ట్రాలు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వ్యవస్థను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదు.

* కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్‌ను కేటాయించే కొత్త వ్యవస్థ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే పనిచేస్తుంది. ఇందుకు యజమాని ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్- 1989 లోని రూల్ 47ని ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం.. BH రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనాలు కొత్త రాష్ట్రంలోకి మారిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని ఆదేశించింది.

* కొత్త రిజిస్ట్రేషన్‌ పొందడానికి అర్హులు ఎవరు?
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూల ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా BH నంబర్ పొందడానికి అర్హులు. వీరు ఫారం 60తో పాటు ఎంప్లాయ్‌మెంట్ ఐడీ లేదా ప్రూఫ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. రాష్ట్ర అధికారులు ఈ ప్రూఫ్స్‌ను ధ్రువీకరించి, అర్హులకు BH రిజిస్ట్రేషన్‌ను కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్‌ను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా జనరేట్ చేస్తారు.

* ట్యాక్స్ ఎలా వర్తిస్తుంది?
BH సిస్టమ్ కింద నమోదయ్యే వాహనాలకు రెండు సంవత్సరాల పాటు రహదారి పన్ను విధిస్తారు. ఆ తర్వాత రెండు గణాంక సంవత్సరాల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి. ఇందులో వాహన యజమాని వెహికల్ లైఫ్ అయిన మొత్తం 15 సంవత్సరాలకు ఒకేసారి రహదారి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు మారినప్పుడు రోడ్ ట్యాక్స్ రిఫండ్ తలనొప్పులు ఎదురుకావు. పద్నాలుగో సంవత్సరం పూర్తయిన తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను ఏటా వసూలు చేస్తారు. ఇది ఆ వాహనం కోసం గతంలో వసూలు చేసిన మొత్తంలో సగం ఉంటుంది.

* రోడ్ ట్యాక్స్ ఎంత ఉంటుంది?
BH రిజిస్ట్రేషన్ వాహనాలకు వర్తించే రోడ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం నిర్వచించింది. వాహనం ధర రూ. 10 లక్షల లోపు ఉంటే.. దానికి 8 శాతం రోడ్ ట్యాక్స్ వర్తిస్తుంది. రూ. 10-20 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు 10 శాతం.. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే వాహనాలకు 12 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. డీజిల్ వాహనాలకు 2 శాతం ఎక్కువ, ఎలక్ట్రిక్ వాహనాలకు 2 శాతం తక్కువ ట్యాక్స్ విధిస్తారు. అయితే రోడ్ ట్యాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అనేక సూచనలను స్వీకరించింది. ఎన్నోసార్లు రాష్ట్రాలతో చర్చించింది.

* BH రిజిస్ట్రేషన్ వెహికల్ నంబర్ ఎలా ఉంటుంది?
సాధారణంగా BH సిరీస్‌ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలకు “21 BH XXXX AA” ఫార్మాట్‌లో నంబర్ కేటాయిస్తారు. ఇందులో మొదటి రెండు అంకెలు.. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన సంవత్సరాన్ని సూచిస్తాయి. BH అనేది సిరీస్ కోడ్ కాగా, నాలుగు సంఖ్యలు (XXXX) ర్యాండమ్‌గా జనరేట్ చేసిన వాహన నంబర్. దీనికి అదనంగా రెండు ఆంగ్ల అక్షరాలు నెంబర్ ప్లేట్‌పై ఉంటాయి.
Published by:Sumanth Kanukula
First published: