Explained: 2,500 ఖడ్గమృగం కొమ్ములను దహనం చేస్తున్న అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే..

ఖడ్గమృగం కొమ్ములను దహనం చేస్తున్న దృశ్యం

రాష్ట్రవ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం నిర్ణయాన్ని ప్రకటించింది.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల సంరక్షణ కోసం ఏటా సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని (World Rhino Day) నిర్వహిస్తారు. ఈ ఏడాది వేడుకలను అస్సాం ప్రభుత్వం వినూత్నంగా నిర్వహించింది. వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2,500 ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దహనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు అస్సాం ప్రభుత్వం ప్రత్యేక వేడుకను సైతం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం నిర్ణయాన్ని ప్రకటించింది.

* ఈ వేడుక ఉద్దేశం ఏంటి?
ఒకే కొమ్ము ఉండే ఖడ్గమృగాలను (One horned rhinoceros) వేటగాళ్లు చంపేసి, కొమ్ములను స్మగ్లింగ్ చేస్తున్నారని అస్సాం ప్రభుత్వం చెబుతోంది. దీంతో వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఖడ్గమృగాల కొమ్ములను కాజీరంగ జాతీయ ఉద్యానవనం (KNP) లోని బోకాఖట్‌లో దహనం చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఇతర రాజకీయ నాయకులు సైతం కార్యక్రమానికి హాజరవనున్నారు.

ఖడ్గమృగం కొమ్ముల గురించి ప్రచారంలో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు ఖడ్గమృగాల సంరక్షణకు ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు అస్సాం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎంకే యాదవ. ఈ జీవుల కొమ్ములకు ఎలాంటి విలువ లేదని వేటగాళ్లు, స్మగ్లర్లకు తెలియజేయడమే కార్యక్రమం లక్ష్యమని ఆయన వివరించారు.

బ్లాక్ మార్కెట్‌లో ఈ కొమ్ములకు అధిక ధర పలుకుతుంది. చైనీయులు తయారు చేసే సంప్రదాయ మెడిసిన్‌లో వీటిని వాడుతారని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. క్యాన్సర్ నుంచి హ్యాంగోవర్ వరకు, కామోద్దీపనకు తోడ్పడే మందుల తయారీలో సైతం గ్రౌండ్ రైనోల కొమ్ములను ఉపయోగిస్తారని అధికారులు చెబుతున్నారు. వియత్నాంలో ఖడ్గమృగం కొమ్మును మెరుగైన సోషల్ స్టేటస్‌కు గుర్తుగా భావిస్తారు. ఆయా దేశాల్లో వీటికి ఉన్న డిమాండ్ కారణంగా ఖడ్గమృగాలు వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయి. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు.

ఇలా బహిరంగంగా ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేయడానికి సంబంధించిన కేసు.. వన్యప్రాణి (రక్షణ) చట్టం- 1972లోని సెక్షన్ 39 (3) (c) కి అనుగుణంగా ఉండే ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు. గౌహతి హైకోర్టు తీర్పు ప్రకారం కొమ్ముల నిర్వీర్యంపై గత నెలలో బహిరంగ విచారణ జరిగింది. కానీ దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని అధికారులు తెలిపారు.

* ఈ కొమ్ములు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి?
ఖడ్గమృగాల కొమ్ములను కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రెజరీలలో నిల్వ చేశారు. సహజ కారణాల వల్ల లేదా వేటాడటం వల్ల ఒక ఖడ్గమృగం మరణించిన తర్వాత.. దాని కొమ్మును తప్పనిసరిగా రాష్ట్ర ట్రెజరీలలో అటవీ శాఖ అదుపులో భద్రపరుస్తుంది. 'హార్న్ రీవెరిఫికేషన్' ప్రోగ్రాంలో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అటవీ శాఖ అధికారులు కొమ్ములను పరిశీలించారు. ఏడు వన్యప్రాణుల జోన్లలోని (మొరిగావ్, మానస్, మంగళదై, గౌహతి, బోకాఖట్, నాగావ్ మరియు తేజ్‌పూర్) ట్రెజరీల్లో ఉన్న 2,500కు పైగా కొమ్ములను వారు పరిశీలించారు.

ఈ ప్రక్రియ వివిధ దశల్లో పూర్తయింది. DFOలు, వన్యప్రాణి నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఇందులో పాలుపంచుకున్నారు. ప్రతి కొమ్ము జన్యు నమూనా, ఇతర అవసరాల కోసం DNAని పరిశీలించడం, ట్యాగ్ చేయడం, తూకం వేయడం, కొలవడం.. ఇలా అన్ని దశలూ అధికారికంగా పూర్తి చేశారు. వీటి నుంచి అత్యధిక శాతం కొమ్ములను నాశనం చేయడానికి పక్కన పెట్టారు. అయితే ఇందులో ప్రత్యేక లక్షణాలు కలిగిన ఐదు శాతం కొమ్ములను ప్రత్యేకంగా సంరక్షించాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 12న ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 2,623 కొమ్ములను పరిశీలించిన నిపుణుల బృందం.. వాటిలో 2,479 కొమ్ములను దహనం చేయాలని నిర్ణయించింది. మరో 94 వరకు సంరక్షణ కోసం కేటాయించారు. వీటిలో గౌహతి ట్రెజరీలో ఉన్న పొడవైన కొమ్ము (51.5 సెం.మీ., బరువు 2.5 కేజీలు), బోకాఖట్ ట్రెజరీలో ఉన్న అత్యంత భారీ కొమ్ము (3.05 కిలోలు, 36 సెం.మీ.) ఉన్నాయి.

* గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా?
గతంలో ఎప్పుడూ కొమ్ములను బహిరంగంగా నాశనం (destroy) చేయలేదు. అయితే అటవీ శాఖ ఉద్యోగులు కొందరు ట్రెజరీల్లోని కొమ్ములను అక్రమంగా అమ్ముకుంటున్నారని, వాటి స్థానంలో నకిలీవి ఉంచుతున్నారని ఆర్‌టీఐ కార్యకర్త దిలీప్ నాథ్ గతంలో ఆరోపించారు. దీంతో 2016లో అప్పటి ప్రభుత్వం ‘హార్న్ రీవెరిఫికేషన్’ కార్యక్రమాన్ని మొదటిసారి ప్రారంభించింది. అప్పట్లో ఐదు కొమ్ములు మినహా మిగిలినవన్నీ నిజమైనవేనని అధికారులు గుర్తించారు.

* ఖడ్గమృగాల వేట కేసులు తగ్గుతున్నాయా లేదా పెరుగుతున్నాయా?
2013, 2014 లో ఖడ్గమృగాల వేటకు సంబంధించి అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో ఏటా 27 చొప్పున.. దశాబ్దంలో కెళ్లా అత్యధిక సంఖ్యలో ఖడ్గమృగాలను వేటాడి చంపారు. ఈ సంఖ్య 2015లో 17.. 2016లో 18.. 2017, 2018లో 6.. 2019లో 3 కి తగ్గింది. 2020- 21లో వేటకు సంబంధించిన నేరాలు బాగా తగ్గాయి. అయినా కూడా ఇది తీవ్రమైన నేరమని, అందువల్ల ఖడ్గమృగాల రక్షణ విషయంలో రాజీ పడట్లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?

Telangana: కేసీఆర్ కాదు కేటీఆర్.. వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా ?

ఒక కొమ్ము మాత్రమే ఉండే ‘వన్ హార్న్డ్ రైనో’లను IUCN రెడ్ లిస్ట్ అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఇది తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న జీవుల జాబితాలో ఉంది. 2019లో అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. KNPలో ఖడ్గమృగాల వేట, సంబంధిత కార్యకలాపాలను నిరోధించడానికి ప్రత్యేకంగా "స్పెషల్ రైనో ప్రొటెక్షన్ ఫోర్స్‌" పేరుతో ఒక దళాన్ని ఏర్పాటు చేసింది. 2018 మార్చిలో నిర్వహించిన ఖడ్గమృగాల జనాభా లెక్కల ప్రకారం.. KNPలో మొత్తం 2,413.. ఒరాంగ్ నేషనల్ పార్క్‌లో 101.. పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలో 102.. మానస్ నేషనల్ పార్క్‌లో 43 ఖడ్గమృగాలు ఉన్నాయి.
Published by:Kishore Akkaladevi
First published: