ప్రతిఏటా వందల కోట్ల ఆస్తి నష్టం, వేల సంఖ్యలో ప్రాణనష్టానికి కారణముతోన్న అస్సాం వరదలను అడ్డుకోకపోయినా, కనీసం నివారించే అవకాశం లేదా? ఏటేటీ అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నాయి? సమస్యను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
వర్షాకాలం (Monsoon) మొదలు కాకముందే అస్సాం (అసోం-Assam) రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల వస్తున్న వరదలు (Floods) విధ్వంసకాండకు దారి తీస్తున్నాయి. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర (Northeastern State) ప్రజలు ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వర్షాకాలం స్టార్ట్ కావడమే ఆలస్యం ఇక్కడ వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. ప్రతిసారి వర్షాకాలం కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతోంది. అసలు ప్రతిఏటా అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నాయి? వరదల సమస్యను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, ఈసారి రుతుపవనాలు ఇంకా ఆరంభం కాలేదు కానీ అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, ఇప్పటికే కనీసం 5.75 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల కారణంగా మే 27, 2022 నాటికి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావితమైన 5.75 మందిలో, 1,25,471 మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలో 34 జిల్లాలు ఉండగా 22 జిల్లాల్లోని 1,709 గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 82,503 హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు దెబ్బతిన్నాయి.
ఏటేటా వరదలు ఎందుకు? : భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. 1988, 1998, 2004 సంవత్సరాల్లో వచ్చిన వరదలు రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయి. 2004లో పోటెత్తిన వరదలు 12.4 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేశాయి. 251 మంది ప్రజల మరణానికి కారణమయ్యాయి. అస్సాం ప్రభుత్వం ప్రకారం, రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతం (Flood-prone) 31.05 లక్షల హెక్టార్లు ఉంటుంది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 78.523 లక్షల హెక్టార్లు. అంటే రాష్ట్రంలోని దాదాపు 40% విస్తీర్ణం వరదలకు గురవుతుంది. దేశంలోని మొత్తం వరద పీడిత ప్రాంతంలో ఒక్క అస్సాంకే దాదాపు 10% వాటా ఉంది. అస్సాంలో వరదల కారణంగా సగటు వార్షిక నష్టం రూ.200 కోట్లుగా ఉంది. 1998లో, సుమారు రూ.500 కోట్లు 2004లో రూ.771.00 కోట్లు నష్టం వాటిల్లింది.
అస్సాంలోని సహజ స్థలాకృతి (Topography), వార్షిక అధిక వర్షపాతం కాకుండా ప్రతిఏటా విధ్వంసకర వరదల రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మానవ నిర్మిత, సహజ కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం బ్రహ్మపుత్ర, బరాక్ నదితో సహా విస్తారమైన నదులకు నిలయంగా ఉంది. వాటికి 50 కంటే ఎక్కువ ఉపనదులు ఉన్నాయి. ఈ నీళ్లన్నీ కూడా వర్షాకాలంలో అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. అస్సాంకి పొరుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ నుంచి కూడా నదీ జలాలు వస్తుంటాయి. 2004, 2014, మేఘాలయలోని పరీవాహక ప్రాంతాలలో బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డు ఉపనదులు భారీ వరదలను ఎదుర్కొన్నాయి. 2011లో అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండటంతో అస్సాంలో వరదలు మరింత తీవ్రమయ్యాయి.
అంతేకాదు బ్రహ్మపుత్ర నది వల్ల ఒడ్డు కోతకు గురవుతుంది. అస్సాంలో వరదలు రావడానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. అధిక నీటి ప్రవాహం వల్ల ఒడ్డున ఉన్న నేల కొట్టుకుపోవడాన్ని కోతకు గురికావడం అంటారు. ఒడ్డు కోత నది వెడల్పును పెంచడంతోపాటు దాని గమనాన్ని మారుస్తుంది. అస్సాం ప్రభుత్వం ప్రకారం, రాష్ట్రంలోని 7.40% విస్తీర్ణంలో ఉన్న 4.27 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ భూమి 1950 నుంచి బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల వల్ల కోతకు గురైంది.
ఒడ్డు కోత కారణంగా బ్రహ్మపుత్ర నది వెడల్పు కొన్ని ప్రదేశాలలో 15 కిలోమీటర్ల వరకు పెరిగింది. దీంతో ఇండియాలోనే అత్యంత విశాలమైన నదిగా బ్రహ్మపుత్ర మారింది. ఏటా దాదాపు 8,000 హెక్టార్ల భూమి కోతకు గురవుతుందని అంచనా. వరదలు మానవులు చేసే పనుల వల్ల కూడా సంభవిస్తాయి. నదీ తీరాలు, చిత్తడి నేలల ఆక్రమించడం, నీటి పారుదల లేకపోవడం, ప్రణాళిక లేని పట్టణ వృద్ధి, కొండ కోత, అటవీ నిర్మూలన, నిర్మిస్తున్న ఆనకట్టలు ఈ విపత్తులను మరింత పెంచుతున్నాయి..
ప్రభుత్వ చర్యలు : 1982లో బ్రహ్మపుత్ర బోర్డు అస్సాంలో వరదలను తగ్గించేందుకు ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మించాలని సూచించింది. ఆనకట్టలు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు నిర్మించారు కానీ వాటి వల్ల అంతగా ఉపయోగం ఉండటం లేదు. అస్సాంలోని జలవనరుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా కట్టలు, వరద గోడలను నిర్మించింది. నది శిక్షణ, ఒడ్డు రక్షణ, కోత నిరోధకం, పట్టణ రక్షణ ఈ చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.