ASSAM BORDER DISPUTES WITH NORTH EASTERN STATES BEDEVILS RELATIONS HERE IS HOW MKS GH
Northeast: పేరుకే సెవెన్ సిస్టర్స్.. ప్రజల మధ్య నిత్యం ఫైటింగ్స్.. సరిహద్దు గొడవలకు పరిష్కారమేది?
ప్రతీకాత్మక చిత్రం
ఈశాన్య భారత్‌లో సరిహద్దు వివాదాలతో రాష్ట్రాల నడుమ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా అస్సాంకు, పొరుగు రాష్ట్రాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి తయారైంది.
ఈశాన్య భారత్‌లో సరిహద్దు వివాదాలతో రాష్ట్రాల నడుమ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా అస్సాంకు, పొరుగు రాష్ట్రాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి తయారైంది. గిరిజనులు అధికంగా నివసించే ఈశాన్య భారతంలో గొడవలకు ప్రధాన కారణం విభజన సమస్యలే అనేది సుస్పష్టం. అస్సాంలో భాగంగా ఉంటూ రాష్ట్రాలుగా ఏర్పడ్డ మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో సరిహద్దు సమస్యలు(Border Disputes) తిష్టవేశాయి. ఫలితంగా అనునిత్యం ఘర్షణలు, యుద్ధపూరిత వాతావరణం నెలకొంటున్నాయి. వీటివెనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన సొంత వాదనలు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఏర్పాటు వెనుక ఉన్న చరిత్రను ఓసారి గమనిస్తే..
మేఘాలయ:
అస్సాం- మేఘాలయ(Assam-Meghalaya Dispute) మధ్య వివాదం 1971 నాటి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాలు చేయడంతో ప్రారంభమైంది. దీనిప్రకారం మేఘాలయలోని మికిర్ హిల్స్(ప్రస్తుత కర్బీ, అంగ్లాంగ్ జిల్లా) పరిధిలోని 1, 2 బ్లాక్‌లను అస్సాంలో కలిశాయి. అయితే.. 1835లో నోటిఫికేషన్ ప్రకారం ఈ రెండు బ్లాక్‌లు తన పరిధిలోని ఖాసీ, జైంతియా హిల్స్ జిల్లాలో భాగమని మేఘాలయ వాదిస్తోంది. దీనికి సంబంధించి మేఘాలయ 1872, 1929 సర్వే మ్యాప్‌లు, 1878, 1951 నాటి నోటిఫికేషన్లను ఆధారంగా చూపిస్తోంది. అంతేగాక చురాచంద్ కమిటీ సిఫార్సులను సైతం తిరస్కరించింది. ప్రస్తుతం 733 కిమీ అస్సాం-మేఘాలయ సరిహద్దులో 12 పాయింట్ల వివాదాలు ఉన్నాయి.
వివాదాస్పద సరిహద్దులపై ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా సర్వేలు నిర్వహించాయి. వివాద పరిష్కార మార్గాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఏడాది ఆగష్టు 6న గౌహతిలో మరోసారి సమావేశం కానున్నారు.
అరుణాచల్ ప్రదేశ్:
ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. కొండ గిరిజన తెగలకు సంప్రదాయక నివాస ప్రాంతంగా ఉన్న అటవీ ప్రాంతాలను ఏకపక్షంగా అస్సాంకు బదిలీ చేశారనేది అరుణాచల్ ప్రదేశ్(Assam-Arunachal Pradesh Dispute) వాదన. ఈ వివాద పరిష్కారంపై 1987లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర హోదాను సాధించిన తర్వాత, ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. పలు సర్వేల అనంతరం కొన్ని ప్రాంతాలను అస్సాం నుంచి అరుణాచల్‌కు బదిలీ చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. అయితే అస్సాం దీనిని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.
మిజోరాం:
అస్సాం-మిజోరాం సరిహద్దులో 1994, 2007 సంవత్సరాల్లో కొన్నిఘటనలు మినహా పరిస్థితి అదుపులోనే ఉంటూ వస్తోంది. అయితే 2020లో ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం ముదిరిందని చెప్పవచ్చు. 2007 వివాదం తరువాత ప్రస్తుత సరిహద్దును అంగీకరించేది లేదని మిజోరాం చెబుతోంది. దీనికి కారణం.. 1873 బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటైర్ రెగ్యులేషన్ (BEFR) కింద 1875 నోటిఫికేషన్ ప్రకారం ఇన్నర్ లైన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆధారంగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో ఆరుగురు పోలీసులు సహా ఏడుగురు మరణించిన నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
నాగాలాండ్:
1963లో నాగాలాండ్ రాష్ట్రంగా అవతరించిన వెంటనే ఈ రాష్ట్రాల నడుమ వివాదం ప్రారంభమైంది. 1962 నాగాలాండ్ స్టేట్ యాక్ట్, నాగా హిల్స్ అండ్ ట్యున్సాంగ్-1925(NHTA) నోటిఫికేషన్ ప్రకారం సరిహద్దులు ఏర్పడ్డాయి. కానీ ఈ విభజనను నాగాలాండ్ అంగీకరించట్లేదు. చచ్చర్, నాగావ్ జిల్లాల్లో నాగాలు అధికంగా ఉండే ప్రాంతాన్ని కూడా కలపాలని డిమాండ్ చేస్తోంది.
దీనితో ఈ రెండు రాష్ట్రాల(Assam-Nagaland Dispute) నడుమ మొదటినుంచే అంటే 1965లోనే మొదటిసారి సరిహద్దు ఘర్షణలు ఉద్రిక్తతలు చెలరేగాయి. అనంతరం 1968, 1979, 1985, 2007, 2014లో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనితో తన పరిధిలోని ఏ ప్రాంతాన్నీ నాగాలాండ్ ఆక్రమించుకోకుండా శాశ్వత నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది అస్సాం.
* ప్రయోజనం శూన్యం..
ఈశాన్య ప్రాంతంలోని వివిధ అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని 2005లో సుప్రీంకోర్టు కేంద్రన్ని ఆదేశించింది. అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వివాద పరిష్కారానికి గతంలో కేంద్రం సుందరం కమిషన్ (1971), శాస్త్రి కమిషన్ (1985) అనే రెండు కమిషన్లను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రాష్ట్రాలు తమ సిఫార్సులను ఆమోదించకపోవడంతో సమస్య పరిష్కారంలో ఈ కమిషన్లు ప్రభావం చూపలేకపోయాయి.
* వివిధ రాష్ట్రాలు-సరిహద్దులు:
అస్సాం-అరుణాచల్ ప్రదేశ్: ఉదల్గురి, సోనిత్పూర్, బిస్వనాథ్, లఖింపూర్, ధేమాజీ, చరైడియో, తీన్సుకియా, దిబ్రూగఢ్ ఎనిమిది జిల్లాల పరిధిలో 804.1 కి.మీ.
అస్సాం-మిజోరాం: అస్సాంలోని చచ్చర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలు, మిజోరాంలోని కొలాసిబ్, మమిత్, ఐజ్వాల్ జిల్లాల మధ్య కలిపి రెండు రాష్ట్రాలూ 164.6 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి.
అస్సాం-నాగాలాండ్: శివసాగర్, చరైడియో, జోర్హాట్, గోలాఘాట్ నాలుగు జిల్లాల మధ్య 512.1 కి.మీ.
అస్సాం-మేఘాలయ: పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్, దిమా హసావో, మోరిగావ్, కామ్రూప్ మెట్రో, కామ్రూప్ రూరల్, గోల్‌పడా, ధుబ్రి, సౌత్ సల్మారా మధ్య 884.9 కి.మీ.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.