ARGUMENTS IN THE DELHI HIGH COURT ON MARITAL RAPE WHAT IS THE ORIGINAL MARITAL RAPE WHAT DOES THE LAW SAY ABOUT THIS GH VB
Explained: వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు.. అసలు Marital Rape అంటే ఏంటి..? చట్టం దీనిగురించి ఏం చెబుతోంది..?
ప్రతీకాత్మక చిత్రం
అత్యాచారానికి సంబంధించి IPCలోని సెక్షన్ 375కు ఇచ్చిన మినహాయింపు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ సహ ఇతరులు ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు.
వైవాహిక అత్యాచార (Marital Rape) రక్షణకు సంబంధించిన IPC నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సమ్మతి, మహిళల లైంగిక స్వేచ్ఛపై రాజ్య నియంత్రణ పరిధి, చట్టంలో ఉన్న చారిత్రక తప్పిదాలను సరిదిద్దడం వంటి అనేక కీలక విషయాలపై ఈ కేసు దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ఐపీసీలో(IPC) ఈ నిబంధన ఎందుకు ఉంది? ఏ హక్కులను ఇది అతిక్రమిస్తుంది? కోర్టు ముందు ఉన్న వాదనలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం. అత్యాచారానికి సంబంధించి IPCలోని సెక్షన్ 375కు ఇచ్చిన మినహాయింపు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ సహ ఇతరులు ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు. జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ సి.హరిశంకర్‌తో కూడిన ద్విసభ్య బెంచ్ వాదనలు విననుంది. సీనియర్ న్యాయవాదులు రాజశేఖర్, రెబెకా జాన్ ఈ కేసులో కోర్టు సహయకులుగా వ్యవహరించనున్నారు.
రేప్‌ను నిర్వచించే IPC సెక్షన్ 375లో ఒక కీలక మినహాయింపు ఉంది. ఒక వ్యక్తి “తన భార్య వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ కాకపోతే, ఆమెతో జరిపే లైంగిక సంపర్కం, లైంగిక చర్యలు అత్యాచారం కిందకు రావు.” అనేది దీని సారాంశం. ఈ మినహాయింపు వల్ల భర్తకు తన భార్య సమ్మతి ఉన్నా లేకపోయినా సెక్స్ జరిపేందుకు చట్టపరమైన అనుమతి లభిస్తుంది. మహిళల వైవాహిక స్థితిని ఆధారం చేసుకొని కల్పిస్తున్న ఈ మినహాయింపు స్త్రీల సమ్మతిని తక్కువ చేస్తుందని, ఈ మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని కొందరు సవాల్ చేస్తున్నారు.
పూర్వకాలంలో అనేక వలస రాజ్య చట్టాల్లో ఈ వైవాహిక అత్యాచార రక్షణ ఉన్నట్టు కనిపిస్తోంది. స్థూలంగా దీనికి రెండు కారణాలు ఉండవచ్చు అవేంటంటే.. పరిపూర్ణ సమ్మతి: వివాహం ద్వారా మహిళ తమ భర్తకు శాశ్వత సమ్మతిని అందజేస్తుంది. దానిని వెనక్కి తీసుకోవడం కుదరదు. భార్య భర్త సొత్తు అనే భావనతో ఇది రూపుదిద్దుకుంది. సెక్స్ కోరడం: వివాహ బంధంలో లైంగిక బాధ్యతలన్నింటినీ మహిళ నిర్వర్తించాలనే భావనతో ఇది ముడిపడి ఉంది. ఎందుకంటే వివాహం ప్రధాన ఉద్దేశం సంతానోత్పత్తి. భార్య నుంచి భర్త సెక్స్ ఆశిస్తాడు కాబట్టి దాన్ని స్త్రీ తిరస్కరించజాలదు.
వైవాహిక అత్యాచార రక్షణను బ్రిటన్ ప్రభుత్వం 1991లోనే రద్దు చేసింది. 1983లో కెనడా, 1993లో దక్షిణాఫ్రికా, 1981 నుంచి ఆస్ట్రేలియా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాలు రూపొందించాయి.
కోర్టు ముందు ఉన్న వాదనలేంటి?
రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణాలు అందించిన అన్ని ప్రాథమిక హక్కులకు భంగకరంగా నిలుస్తోంది వైవాహిక అత్యాచార రక్షణ. ఈ రక్షణ వివాహిత మహిళలు, అవివాహిత మహిళలనే అనవసరమైన వర్గీకరణను సృష్టిస్తోందన్నది పిటిషనర్ల వాదన. అంతే కాదు లైంగిక చర్యకు సమ్మతి తెలిపే హక్కును వివాహిత మహిళకు లేకుండా చేస్తోందని అంటున్నారు. సమ్మతి అనేది లైంగిక చర్య సమయంలో/మధ్యలో కూడా వెనక్కి తీసుకోవచ్చనే విషయాన్ని కోర్టులు అంగీకరిస్తున్నాయి కాబట్టి పరిపూర్ణ సమ్మతి అనే భావన చట్టపరంగా చెల్లదని వాదిస్తున్నారు.
అయితే వివాహంలో సెక్స్, సెక్స్ వర్కర్‌తో సెక్స్ మధ్య తేడాను న్యాయమూర్తులు గుర్తించాల్సి ఉంటుంది. మన దేశంలో వివాహం అనేది సంతానోత్పత్తికి అనే భావన ఉంది. మరో వైపు అబార్షన్ హక్కు కల్పిస్తూ, సంతానోత్పత్తి కోసం మహిళలు సమ్మతి తెలియజేయాల్సిందేనన్నది పరస్పర విరుద్ధ భావనగా కనిపిస్తోంది.
కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వైవాహిక అత్యాచార రక్షణను కేంద్ర ప్రభుత్వం సమర్ధించింది. చట్టాన్ని భార్యలు దుర్వినియోగం చేయకుండా చూడటంతో పాటు, వివాహ వ్యవస్థను పరిరక్షించడం అనే అంశాలు ప్రభుత్వ వాదనల్లో ఉన్నాయి. కానీ ఈ విషయంలో విస్తృత చర్య జరగాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దేశంలోని క్రిమినల్ చట్టాలను సమీక్షించేందుకు హోమ్ మంత్రిత్వ శాఖ 2109లో ఒక కమిటీ ఏర్పాటు చేసిందనే విషయాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ మినహాయింపును ఢిల్లీ ప్రభుత్వం కూడా సమర్థించింది. భర్తల చేత అత్యాచారానికి గురయ్యే మహిళలకు చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు విడాకులు, గృహహింస వంటి వెసులుబాటు ఉందని తెలిపింది. వైవాహిక బంధాన్నినిలిపి ఉంచేందుకు భర్తతో భార్య కలిసి జీవించాలని హిందూ వివాహ చట్టం ప్రకారం వైవాహిక అత్యాచారానికి మినహాయింపు ఇవ్వడం సబబేనని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. మరో వైపు వైవాహిక హక్కుల పునరుద్ధరణ అనేది వ్యక్తిగత చట్టాల్లో భాగమే.. కానీ నేర చట్టాల్లో అది లేదు. ఈ విషయాన్ని కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
గతంలో హోమోసెక్సువాలిటీకి సంబంధించి సెక్షన్ 377 విషయంలోనూ ప్రభుత్వాలు యథాతథ స్థితి కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. ఆ నిబంధనలు రద్దు చేసేందుకు అయిష్టత చూపాయి. నిర్భయ కేసు తర్వాత నేర చట్టాల సంస్కరణలపై ఏర్పాటు చేసిన జె.ఎస్.వర్మ కమిటీ వైవాహిక అత్యాచార మినహాయింపును రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన అనేక కీలక సిఫార్సులను ఆమోదించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వైవాహిక అత్యాచార చట్టాన్ని మాత్రం మార్చలేదు. ఈ మినహాయింపును రద్దు చేయాలని ఈ మధ్యే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అయితే ఈ నిబంధన రాజ్యాంగం అమల్లోకి రాకముందే నుంచి ఉన్నది కాబట్టి దానిని రాజ్యాంగబద్ధంగా పేర్కొనలేమని పిటిషనర్లు వాదిస్తున్నారు. అదే సమయంలో పురుషులపై తప్పుడు కేసులు పెట్టకుండా, చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ పిటిషన్ విచారణలో కీలక అంశాలుగా మారనున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.