క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా...అయితే స్టేట్‌మెంట్‌లోని ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి...

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రతి ఒక్కరు క్రెడిట్​ కార్డు బిల్​ స్టేట్​మెంట్​ చూసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్​ కార్డు ఉపయోగించేవారు తమ చెల్లింపులు, కొనుగోళ్లు, క్రెడిట్​ బ్యాలెన్స్​, రివార్డ్​ పాయింట్లు మొదలైన వివరాలను స్టేట్​మెంట్​లో చూసుకోవచ్చని చెబుతున్నారు.

  • Share this:
క్రెడిట్​ కార్డు బిల్​ జనరేట్​ కాగానే పేమెంట్​ చేసేయడం, మళ్లీ క్రెడిట్​ కార్డు వాడుకోవడం.. అందరూ కామన్​గా చేసేపని ఇది. కానీ, మన ఈ–మొయిల్​కు వచ్చిన క్రెడిట్​ కార్డు స్టేట్​మెంట్​లో ఏముంది? దానిలో ఏఏ ఛార్జీలు పొందుపర్చారు? అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కేవలం మినిమం, టోటల్ అవుట్​ స్టాండింగ్​ అమౌంట్​ చూసి కట్టేస్తుంటారు. కానీ, ఇది సరైన పద్దతి కాదని, ప్రతి ఒక్కరు క్రెడిట్​ కార్డు బిల్​ స్టేట్​మెంట్​ చూసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్​ కార్డు ఉపయోగించేవారు తమ చెల్లింపులు, కొనుగోళ్లు, క్రెడిట్​ బ్యాలెన్స్​, రివార్డ్​ పాయింట్లు మొదలైన వివరాలను స్టేట్​మెంట్​లో చూసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల అస్పష్టమైన లేదా అనుమానాస్పద లావాదేవీను సులభంగా గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. క్రెడిట్​ కార్డు స్టేట్​మెంట్​లో తనిఖీ చేయాల్సిన ముఖ్యమైన 6 అంశాలను పరిశీలిద్దాం.

1. స్టేట్​మెంట్ గడువు తేదీ
ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లు​ చెల్లింపు గడువు తేదీ. స్టేట్​మెంట్​ గడువు తేదీతో ఎప్పుడూ అయోమయం చెందాల్సిన పనిలేదు. ఇది మీ స్టేట్​మెంట్​ జనరేట్​ అయిన తేదీ మాత్రమే అని గుర్తించుకోవాలి. మీ క్రెడిట్​ కార్డు బిల్లు​ ఆలస్యంగా చెల్లిస్తే.. ఆ చెల్లింపులపై వడ్డీ లెక్కింపు స్టేట్​మెంట్​ జనరేట్ అయిన మొదటి తేదీ నుంచి మీరు పూర్తిగా బిల్​ చెల్లించిన తేదీ వరకు ఉంటుంది. కాగా, స్టేట్​మెంట్​ తేదీని మొదటి రోజుగా తీసుకొని మీ వడ్డీ లెక్కించబడుతుంది.

2. చెల్లింపు గడువు తేదీ
మీ క్రెడిట్​ కార్డు బకాయిలను ఆయా బ్యాంకుకు జమ చేయయాల్సిన ఆఖరు తేదీనే చెల్లింపు గడువు తేదీ. అంటే, మీకు ఎటువంటి అదనపు ఛార్జీలు వర్తించకూడదంటే ఈ తేదీలోగా మీ పూర్తి అవుట్​ స్టాండింగ్​ అమౌంట్​ను పూర్తిగా చెల్లించాల్సి ఉంఉటంది. ఒకవేళ, మీరు చెక్​ ద్వారా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకుంటే, క్లియరెన్స్ కోసం 2 నుండి -3 రోజుల సమయం పట్టవచ్చు. అందువల్ల, బ్యాంక్ సెలవులు లేదా ఇతర ఊహించని పరిస్థితుల కారణంగా చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండటానికి గడువు పూర్తయ్యే తేదీకి కనీసం వారం ముందు మీ చెల్లింపును పూర్తయ్యేలా చూసుకోండి.

3. బిల్లింగ్​ సైకిల్​
ఇది వరుసగా రెండు స్టేట్​మెంట్ తేదీల మధ్య కాలం. ఇది సాధారణంగా 30 రోజుల వ్యవధి కలిగి ఉంటుంది. ఆ 30 రోజుల్లో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్​ కార్డ్​ స్టేట్​మెంట్​లో ప్రతిబింబిస్తాయి. దీనిలో వడ్డీ జరిమానా, ఆలస్యం రుసుము, బిల్లు చెల్లింపు చేసిన మొత్తం లేదా ఈ కాలంలో ఏవైనా ట్రాన్సాక్షన్​ ఫెయిల్యూర్స్​ ఉంటే దానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా పేర్కొని ఉంటాయి.

4. గ్రేస్ పీరియడ్​
ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, బిల్​ చెల్లించాల్సిన తేదీ నుండి మూడు రోజుల వరకు గ్రేస్​ పీరియడ్​ ఉంటుంది. ఈ సమయంలో కూడా బిల్​ చెల్లించకపోతే ఆయా బ్యాంకులు కార్డుపై ఆలస్యం రుసుము విధిస్తాయి. గ్రేస్​ పీరియడ్​ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే మొత్తంపై ఆలస్య చెల్లింపు కింద వడ్డీని లెక్కిస్తారు. ఇది తదుపరి స్టేట్​మెంట్​లో కనిపిస్తుంది. అయితే, చాలా క్రెడిట్​ కార్డు కంపెనీలు ఒక చెల్లింపు గడువు తేదీ నుంచి తదుపరి గడువు తేదీ వరకు 20 నుంచి 25 రోజుల వరకు గ్రేస్​ పీరియడ్​ ఇస్తున్నాయి.

5. చెల్లించాల్సిన మొత్తం
మునుపటి నెలలో ఖర్చు చేసింది మాత్రమే కాకుండా, దానిపై వర్తించే వడ్డీ లేదా ఆలస్యంగా చెల్లించే ఛార్జీలు, సేవా ఛార్జీలు, ఓవర్​ డ్రా ఫీజు, లావాదేవీల రుసుము, వార్షిక ఛార్జీలు, ఇతర లావాదేవీల రుసుములన్నీ కూడా చెల్లించాల్సిన మొత్తం కిందికే వస్తాయి.

6. చెల్లించాల్సిన కనీస మొత్తం
ఆలస్య రుసుము వసూలు చేయకుండా ఉండాలంటే.. గడువులోగా మీ క్రెడిట్ కార్డు బిల్లు కనీస మొత్తాన్ని చెల్లించాలి. ఇది చెల్లించాల్సిన మొత్తంలో సాధారణంగా 5% వరకు ఉంటుంది. ఆలస్య రుసుమును నివారించేందుకు ఈ కనీస మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ, మొత్తం చెల్లించే వరకు వడ్డీ బకాయిలు పెరుగుతూనే ఉంటాయని గుర్తించుకోవాలి. అయితే, కనీస చెల్లింపు చేస్తే మీపై ఎటువంటి ఆలస్య రుసుము పడకుండా ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: