Immunity boosters: కరోనా రాకుండా ఇమ్యునిటీ బూస్టర్లు వాడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజల్లో తమ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అయితే, కరోనా రాకుండా ఉంటుందంటూ చాలా మంది జనం ఇష్టం వచ్చినట్టు ఇమ్యునిటీ బూస్టర్లు వాడుతున్నారు. డాక్టర్ల నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు లేకుండా అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అంటూ ఇష్టం వచ్చినట్టు ఇమ్యూనిటీ బూస్టర్లు వాడుతున్నారు. దీని వలన లివర్ మీద ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • Share this:
కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగుతున్నాయి. సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడంతో పాటు వైరస్ ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆరోగ్యకరమైన రీతిలో ఇమ్యునిటీ పెంచుకుంటే ఫర్వాలేదు కానీ.. ఇందుకోసం చాలా మంది ఇమ్యునిటీ బూస్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ఇమ్యునిటీ బూస్టర్ల వల్ల కాలేయానికి ప్రమాదమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ILBS) డాక్టర్ ఎస్కే సరీన్ హెచ్చరించారు.

కాలేయంపై ప్రభావం..
"ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విపరీతంగా మందులు ఉపయోగిస్తున్నారు. కొంత వరకు ఇవి మంచి చేకూర్చేవే అయినప్పటికీ కొన్నింటికి శాస్త్రీయ ఆధారాలు, ఆయుర్వేదం, హోమియోపతీలోనూ ఆధారాలు లేవు. ఫలితంగా కాలేయం దెబ్బతినే అవకాశముంది. కోవిడ్ ను దూరం చేసుకునే ప్రయత్నాల్లో కాలేయ సంబంధిత సమస్యల్లో చిక్కుకుంటున్నారు" అని ఎస్కే సరిన్ అన్నారు.
కాలేయం, పిత్త వ్యాధుల కోసం మోనో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన ఐఎల్బీఎస్ న్యూఢిల్లీలో ఉంది. కాలేయం, పిత్త వ్యాధుల నిర్ధారణ, నిర్వహణకు ఇది ప్రత్యేక కేంద్రంగా ఉంది.

కోవిడ్ లక్షణాలు లేనివారికి పనిచేయవు..
ఇటీవలే రెమిడెసివిర్ అనేది మ్యాజిక్ బుల్లెట్ కాదని, మరణాలను తగ్గించే ఔషధం కాదని అర్థం చేసుకోవాలని ఎయిమ్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. యాంటీవైరల్ డ్రగ్ లేకపోవడం వల్ల దీన్ని వాడుతున్నారని, అయితే కోవిడ్ లక్షణాలు లేని వ్యక్తులు లేదా తేలికపాటి లక్షణాలతో ఉన్నవారు వీటిని తీసుకున్నట్లయితే వారికి పనికి రాదని తెలిపారు. అంతే కాకుండా ఆలస్యంగా తీసుకున్నా ఉపయోగముండదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్ లో కరోనా విజృంభణ వేగంగా ఉంది. రెండో వేవ్ లో కరోనా సోకిన వారు రికార్డు స్థాయిలో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,73,810 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణాలు వచ్చేసి 1619గా తెలిపింది. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,78,769 కి చేరిందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల గణనీయంగా ఉంది. దీని ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారాంతపు లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది. కేసులు వేలల్లో నమోదువుతుండటంతో సర్వత్రా ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. కాబట్టి, ఇకపై ఎవరూ మీకు నచ్చినట్టు మెడికల్ షాపునకు వెళ్లి ఇమ్యునిటీ బూస్టర్లు కొనుక్కొచ్చి వేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి.
Published by:Ashok Kumar Bonepalli
First published: