హోమ్ /వార్తలు /Explained /

AP Municipal Elections: విశాఖలో బీజేపీ సెల్ఫ్ గోల్.. గ్రేటర్ లో గట్టెక్కేదెలా?

AP Municipal Elections: విశాఖలో బీజేపీ సెల్ఫ్ గోల్.. గ్రేటర్ లో గట్టెక్కేదెలా?

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

రాబోయే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ బీజేపీ -జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని రెండు పార్టీలు భావించాయి. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీని కష్టాల్లోకి నెట్టేసింది.

గ్రేటర్ విశాఖలో బీజేపీ పరిస్థితి ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఓట్లు అడిగే పరిస్థితి ఉందా..? అంటే సమాధానం లేని ప్రశ్నే. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ-ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఆ పార్టీ తరపున పార్టీ పెద్దలంతా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ బీజేపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందుకే బీజేపీ వేసుకున్న సెల్ఫ్ గోలే కారణం.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజీపీ భారీగా ఆశలు పెట్టుకుంది విశాఖపైనే.. ఎందుకంటే విశాఖలో యూత్ ఓటర్లు పార్టీని బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉండేది. దానికి తోడు విశాఖ నగరంలో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు కూడా భారీగానే ఉన్నారు. వారి ఓట్లు కూడా కలిసి వస్తాయని లెక్కలు వేసుకున్నారు. అందుకే అప్పటి నుంచే విశాఖపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు. గతంలో కూడా బీజేపీకి విశాఖ రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది.

విశాఖ కార్పొరేషన్ కి బీజేపీకి ఎంతో అనుబంధం ఉంది. మామూలు మునిసిపాలిటీగా ఉన్న విశాఖను 1979లో కార్పొరేషన్ చేశారు. ఆ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ జెండా ఎగరేసింది బీజేపీనే. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాదిన మొట్ట మొదటి జెండా విశాఖలోనే బీజేపీ ఎగరేసింది. తొలి మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి బీజేపీ నుంచి గెలిచి సత్తా చాటారు.

తరువాత నుంచి బీజేపీ ఎపుడూ మేయర్ సీటు నెగ్గలేదు. 1987 ఎన్నికలో తెలుగుదేశం గెలిస్తే ఆ తరువాత వచ్చిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సిటీలో బీజేపీ బాగానే పుంజుకుని వచ్చింది. విశాఖ నుంచే గతంలో బీజేపీ నేత కంబంపాటి హరిబాబు ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. విష్ణు కుమార్ రాజు సైతం ఒకసారి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే బీజేపీ గెలిచిన ప్రతిసారి పొత్తుతూనే అది సాధ్యమైంది.

రాబోయే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ బీజేపీ -జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. మొన్నటి వరకు రెండు పార్టీలు కలిపి విశాఖపై భారీ ఆశలే పెట్టుకున్నాయి. యూత్ ఓటర్లు ఎక్కువగా ఉండడం... స్థానికంగా బీజేపీకి పట్టు ఉండడం. ఈ రెండింటికి తోడు పవన్ కళ్యాణ్ కు భారీగా క్రేజ్ ఉండడంతో.. మంచి ఫలితాలే వస్తాయి అని ఆశించింది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీని కష్టాల్లోకి నెట్టేసింది అని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక ప్రాంతమే కాదు.. నగరమంతా భారీగానే స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఉంది. విశాఖ ఉక్కును ఆంధ్రల హక్కు అని భావిస్తారు. అందుకే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామనే నిర్ణయాన్ని నగర వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాది వాళ్లు నగరంలో ఉన్నా.. వారిలో సగం మంది స్టీల్ ప్లాంట్ పై పరోక్షంగా ఆధారపడే ఉన్నారు. దీంతో వారు కూడా కేంద్రం నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినా.. కేంద్రం ప్రకటనలు చూసినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేలా కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆ ప్రకటనను వాయిదా వేస్తున్నట్టు కేంద్రం చెప్పినా కలిసివస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. అందుకే రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి మరి కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వాయిదా వేయడమో.. ఉపసంహరించుకోవడమో.. లేద వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలనో కోరారు.. కానీ కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం బీజేపీదే అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ పరిశర ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రచారానికి వెళ్తే నేరుగా ప్రజలు ఇదే విషయం ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రచారానికి ఎలా వెళ్లాలని బీజేపీ నేతలు మదనపడుతున్నట్టు సమాచారం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే తప్పా.. బీజేపీ నేతలు ముందుకు వెళ్లడం కష్టమే.. శుక్రవారం ఉక్కు ఉద్యమ పరిరక్షణ సమితి ఏపీ బంద్ కు పిలుపు ఇచ్చింది. ఈ బంద్ లో బీజేపీ -జనసేన రెండు పార్టీలు బంద్ కు దూరంగా ఉన్నాయి. దీంతో కార్మిక సంఘాలు మరింత గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్లడం కష్టమే.

జనసేనతో పొత్తు ఉన్న కారణంగా ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గట్టెక్కిస్తాయనే ఆశలు కూడా సన్నగిళ్లుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడాలో తేల్చుకోలేకపోతున్నారు పవన్.. ఇదే విషయం అమిత్ షా దగ్గర ప్రస్తావించినా ఆయన దగ్గర నుంచి స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని సమచారం.  దీంతో ఏం చేయాలో తెలియక జనసేన అధినేత కూడా తలపట్టుకుంటున్నారు. అందులోనూ తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాకలోనే స్టీల్ ప్లాంట్ ఉంది.

ప్రస్తుతం బీజేపీ -జనసేనకు మేయర్ సీటు గెలిచుకునేంత బలం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.  కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం లేకుంటే మెజార్టీ వార్డుల్లో నెగ్గే అవకాశాలు అయితే ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తోడు.. రైల్వే జోన్ ప్రకటించినా.. అందుకు ఇప్పటి వరకు నిధులు కేటాయించింది లేదు. తాజాగా పోర్టులను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో బీజీపీకి నగరంలో రోజు రోజుకూ వ్యతిరేకేత పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ గండాన్ని బీజేపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఎన్నికల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అంటారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, Ap local body elections, AP News, Bjp, Bjp-janasena, Municipal Elections, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు