• HOME
 • »
 • NEWS
 • »
 • EXPLAINED
 • »
 • ANDHRA PRADESH MUNICIPAL ELECTIONS UPDATE YCP SPEED UP OPERATION AKARSH NGS

Andhra Pradesh: మొన్న టీడీపీ తరపున నామినేషన్.. నేడు వేరే పార్టీకి జంప్.. టీడీపీ కీలక నేతకు వైసీపీ చెక్!

Andhra Pradesh: మొన్న టీడీపీ తరపున నామినేషన్.. నేడు వేరే పార్టీకి జంప్.. టీడీపీ కీలక నేతకు వైసీపీ చెక్!

ప్రతీకాత్మక చిత్రం

 • Share this:
  ఏపీలో పరిస్థితి సాధరణ ఎన్నికలను తలపిస్తోంది. అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొన్న పంచాయతీ ఎన్నికలు.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలతో వ్యూహ ప్రతివ్యూహాలు, రాజకీయ విమర్శలతో ప్రస్తుతం ఏపీలో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలతో హవా కొనసాగించిన వైసీపీ మున్సిపాలీటీలను సైత్రం ఏకగ్రీవాలు చేయడంపై ఫోకస్ చేసింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కన్నేసింది.

  విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రకటించిన వైసీపీ.. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో కీలక ప్రాంతాల్లో పూర్తిగా తమ జెండా పాతేయాలని ప్రయత్నిస్తోంది.  మూడు ప్రధాన నగరాలపై ఫోకస్ చేసింది. అయితే విజయనగరంలో అంతర్గత కలహాలు మినహా ప్రత్యర్థి పార్టీ బలంగా కనిపించడం లేదు. కానీ శ్రీకాకుళం, విశాఖ నగరాల్లో మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ తప్పకపోవచ్చని భావిస్తోంది. అందుకే భారీగా ఆపరేషన్ ఆకర్షక్ తెరలేపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ తరపున నామినేషన్ వేసిన వారికి గాలం వేస్తున్నారు అధికార పార్టీ నాయకులు.

  టీడీపీ తరపున నామినేషన్ వేసినవారితో పాటు డమ్మీలను కూడా వైసీపీలో చేర్చుకుంటే.. ఏకగ్రీవాలుగా చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్ర మొత్తం వ్యహారాలు విజయసాయిరెడ్డే దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ మునిసిపాలిటిపైనే ఆయన మొత్తం ఫోకస్ పెట్టారు. దీంతో శ్రీకాళం బాధ్యతలను ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించింది అధిష్టానం. ముఖ్యంగా మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అన్నిచోట్ల వైసీపీ గాలి కనిపించినా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో మాత్రం వైసీపీ ఆటలు సాగలేదు. కేసులు పెట్టి అరెస్టులు చేయించే వరకు విషయం వెళ్లినా టీడీపీ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. దీంతో అచ్చెన్నాయుడి టార్గెట్ గానే వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అచ్చెన్నకు బద్ధ శత్రువైన దువ్వాడకు జిల్లా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.

  మున్సిపల్ ఎన్నికల సమయానికి కుదిరినంతమంది టీడీపీ అభ్యర్థులను వైసీపీలోకి చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఎన్నికల సెగ రాజుకుంది. నిన్నటి వరకు వార్డుల్లో ఓట్ల కోసం ఎత్తుగడలు వేసిన నాయకులు ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు తెలుగుదేశం పార్టీ తరఫున వార్డుల్లో పోటీచేస్తున్న నలుగురు అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జంట పట్టణాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచింది.

  మరికొందరు తమ పార్టీలోకి వస్తారంటూ వైసీపీ నాయకుల ప్రకటనలతో టీడీపీ అప్రమత్తమైంది. ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పార్టీ అభ్యర్థులను పిలిపించి వారితో సమావేశమయ్యారు. వైసీపీ ఎత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై అధిష్టానంతోనూ చర్చిస్తున్నారు. బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పోటీలో ఉన్నవారిని ఇప్పటికే రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ తరఫున వార్డు అభ్యర్థులుగా నామినేషన్‌ వేసి వైసీపీలో చేరిన విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. టీడీపీ బీఫారంతో నామపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలకు ముందే వైసీపీ కండువాలు కప్పుకోవడంతో ఆయా వార్డుల్లో నామినేషన్‌కు మరో అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలాంటి అవకాశం ఇవ్వకపోతే డమ్మిలు, లేదా రెబల్స్ ను టీడీపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు కుటుంబానికి చెక్ చెప్పే దిశగానే వైసీపీ పావులు కదుపుతోంది.
  Published by:Nagesh Paina
  First published: