Virtual Autopsy: శరీరాన్ని కోయకుండానే పోస్ట్‌మార్టం.. వర్చువల్ అటాప్సీ.. ఎలా సాధ్యం?

ప్రతీకాత్మక చిత్రం

వర్చువల్ అటాప్సీ పద్ధతిలో డాకర్లు రోగి శరీరంపై ఏ చిన్న గాటు కూడా చేయకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పద్ధతులను ఉపయోగించి వారి శరీరంలోని భాగాలన్నింటినీ ప్రతి యాంగిల్ నుంచి చెక్ చేయనున్నారు.

  • Share this:
ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే, వారి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహిస్తారు. దీన్నే అటాప్సీ అంటారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో శరీరంలోని భాగాలను కట్ చేయాల్సి వస్తుంది. అందుకే పోస్ట్ మార్టం చేసిన శరీరాన్ని పూర్తిగా కట్టి అందిస్తారు. కానీ దక్షిణ ఆగ్నేయాసియాలోనే మొదటి సారిగా ఆన్ లైన్ మాధ్యమంలో అటాప్సీ నిర్వహించనుంది ఎయిమ్స్. దీనివల్ల పోస్ట్ మార్టం సందర్భంగా మృతదేహాన్ని ఏ చిన్న గాటు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా పోస్ట్ మార్టం పూర్తి చేసే అవకాశం ఉంటుందట. ఈ వర్చువల్ అటాప్సీల ద్వారా మృతదేహాలను ఎంతో గౌరవమైన పద్ధతిలో హ్యాండిల్ చేసే వీలుంటుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ వెల్లడిస్తోంది. ఈ తరహా పోస్ట్ మార్టం పద్దతిని తాజాగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రారంభించారు.

వర్చువల్ అటాప్సీ పద్ధతిలో డాకర్లు రోగి శరీరంపై ఏ చిన్న గాటు కూడా చేయకుండా ఎంఆర్ఐ (మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్), సీటీ స్కాన్ (కంప్యూటరైజ్డ్ టోనోగ్రఫీ) పద్ధతులను ఉపయోగించి వారి శరీరంలోని భాగాలన్నింటినీ ప్రతి యాంగిల్ నుంచి చెక్ చేయనున్నారు. దీనివల్ల శరీరాన్ని ముట్టుకోకుండానే వారి లోపల ఏముందో.. వారి మరణానికి కారణమేంటో సులువుగా తెలుసుకునే వీలుంటుంది. స్కానింగ్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో నిర్వహించే ఈ వర్చువల్ అటాప్సీ పద్దతి ద్వారా శరీరంలోని ప్రతి అవయవం.. అందులోని టిష్యూలను కూడా గమనించే వీలుంటుంది.

శరీరాన్ని సీటీ స్కాన్ మెషీన్ లోకి పంపగానే ఆ పరికరం శరీరంలోని వివిధ భాగాలకు చెందిన దాదాపు 25000 ఫొటోలను తీస్తుంది. వీటిని చూసి అసలు కారణమేంటని నిపుణులు సులువుగా కనిపెట్టే వీలుంటుంది. ఇప్పటికే ఈ పద్ధతిని ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలు పాటిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఈ పద్ధతి ఇప్పటికే అమలవుతోంది.

మామూలు పద్ధతిలో పోస్ట్ మార్టం చేసేకంటే.. ఈ వర్చువల్ పద్ధతిలో పూర్తి చేయడం వల్ల సమయం చాలా మిగులుతుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెడ్ సుధీర్ గుప్తా వెల్లడించారు. ఈ పద్దతిలో అటాప్సీ పూర్తి చేయడానికి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే పడుతుందట. అదే ఫిజికల్ అటాప్సీ అయితే పూర్తి చేయడానికి ఆరు గంటల సమయం పట్టే అవకాశాలుంటాయట. కట్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల దీనివల్ల చాలా తక్కువ సమయంలో పని పూర్తవ్వడమే కాకుండా సులువుగా కూడా పూర్తవుతుందట. దీనివల్ల వీలైనంత తొందరగా మృతదేహాన్ని వీలైనంత తొందరగా బంధువులకు అప్పగించే వీలు కలుగుతుంది.

ఇంతకుముందు కుట్లు వేసి శరీరాన్ని పూర్తిగా కవర్ చేసి అందించేవారు. కానీ ఈ పద్ధతి వల్ల వారి శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగానే అందించే వీలుంటుంది. తద్వారా చనిపోయిన వారి డిగ్నిటీని తగ్గించకుండా ఉంచొచ్చన్నది గుప్తా అభిప్రాయం. ఈ సేవలను ప్రారంభించడంపై ఆయన స్పందిస్తూ ఇకపై వర్చువల్ అటాప్సీ పద్ధతి ద్వారా శరీరంపై ఎలాంటి కట్స్ లేకుండా శరీరంలోపల ఉన్నవన్నీ చూసే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని రీసర్చ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా సాధారణంగా కట్ చేయడం వల్ల తెలుసుకోలేని ఇతర విషయాలను కూడా తెలుసుకునే వీలుంటుందని గుప్తా వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published: