Explained: Afghanistan New Rulers: తాలిబన్ల ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న వ్యక్తులు ఎవరు? వారి నేపథ్యం ఏంటి?

ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌

అఫ్గానిస్థాన్‌‌లో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో తాలిబన్ అగ్రనాయకులు వివిధ వర్గాలు, తెగల ప్రముఖులతో సమావేశమవుతూ చర్చలు జరుపుతున్నారు.

  • Share this:
అఫ్గానిస్థాన్‌ పాలన మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అధికారికంగా పగ్గాలు చేపట్టనప్పటికీ, అఫ్గాన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన తరువాత ఈ ఉగ్ర సంస్థ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో తాలిబన్ అగ్రనాయకులు వివిధ వర్గాలు, తెగల ప్రముఖులతో సమావేశమవుతూ చర్చలు జరుపుతున్నారు. ఈసారి తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తాలిబన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

* కొత్త అధ్యక్షుడు బరదార్‌?
తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌.. కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. తాలిబన్ల ఉన్నత స్థాయి నాయకుడైన బరదార్‌.. అమెరికాతో జరిగిన చర్చల్లో పాల్గొన్నాడు. తాలిబన్ల రాజకీయ విభాగానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వారం ప్రారంభంలో తాలిబన్లు అఫ్గాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న తరువాత, మొట్టమొదటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో తాలిబన్ల తరఫున బరదార్ పాల్గొన్నారు.

ముల్లా బరదార్ పోపాల్‌జాయ్ పష్తూన్ తెగకు చెందినవారు. తాలిబన్ల వ్యవస్థాపకుడైన ముల్లా ముహమ్మద్ ఒమర్‌కు బరదార్ అత్యంత సన్నిహితుడు. ఒమర్‌తో కలిసి తాలిబన్ సహ వ్యవస్థాపకుడిగా బరదార్ పేరు పొందారు. 2010లో అమెరికా ప్రోత్బలంతో బరదార్‌ను పాక్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) నిర్బంధించింది. అయితే శాంతి చర్చల కోసం బరదార్‌ను జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి ఖతార్‌లోనే ఉంటూ అమెరికాతో జరిగిన చర్చల్లో పాల్గొంటున్నారు.

బరదార్ మొత్తం ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. 2018లో తాలిబన్లతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఆయనను విడుదల చేశారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మయ్ ఖలీల్జాద్‌తో చర్చలు జరిపిన తొమ్మిది మంది సభ్యుల తాలిబన్ బృందానికి బరదార్‌ నాయకత్వం వహించారు. ఈ దోహా ఒప్పందంపై జల్మయ్, బరదార్ సంతకాలు చేశారు.

తాలిబన్లు.. అల్-ఖైదా లేదా ఐసిస్‌కు ఆశ్రయం ఇవ్వకూడదనే షరతుపై అమెరికా తన దళాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది. పాక్ నాయకత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. బరదార్ కొత్త ప్రభుత్వానికి అధిపతి అయితే, అతడు పాకిస్థాన్ ఆర్మీ, ISI కోరుకున్న దానికంటే మరింత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది.

* కొత్తగా సుప్రీం లీడర్‌ పదవి
సుప్రీం లీడర్ లేదా అమీర్ ఉల్ మొమినీన్ బాధ్యతలను మరో తాలిబన్ నేత మౌల్వీ హైబతుల్లా అఖుంజదా చేపట్టవచ్చు. ఆయన నేరుగా ప్రభుత్వంలో పాల్గొనకపోవచ్చు. సాధారణంగా ఇరాన్‌లో ఇలాంటి పదవి ఉంటుంది. ఇటీవల దోహాలో చర్చల సమయంలో ఈ ఇరానియన్ తరహా సుప్రీం లీడర్ పదవి గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త అఫ్గాన్‌ ప్రభుత్వంలో తాలిబన్లు ఈ పదవిని సృష్టిస్తే.. దానికి అఖుంజదా ఎంపిక కావచ్చు.

* యువకులు, అనుభవజ్ఞులతో జట్టు ఉంటుందా?
తాలిబన్ సంస్థ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు, 31 ఏళ్ల ముల్లా మొహమ్మద్ యాకూబ్ సైతం కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకునే అవకాశం ఉంది. అతడు తాలిబన్ మిలిటరీ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. 2016లో తాలిబన్లు కొత్త నాయకుడిని ఎన్నుకున్నప్పుడు యాకూబ్ ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆ సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్నందువల్ల, యాకూబ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

అమెరికా, అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్న తాలిబన్ల ప్రతినిధుల బృందంలో యాకూబ్ లేడు. కానీ అతడు లీడర్‌షిప్ కౌన్సిల్‌గా చెప్పుకునే రెహ్బరి షురాలో భాగంగా ఉన్నారు. దీన్ని క్వెట్టా షురా అని కూడా పిలుస్తారు. 2001లో తాలిబన్లను పదవి నుంచి దింపేసిన తరువాత చాలామంది పాక్‌లోని క్వెట్టా నగరానికి వెళ్లారని చెబుతుంటారు. ఆ నగర నేపథ్యం ఉండటం వల్ల ఈ లీడర్‌షిప్ కౌన్సిల్‌ను క్వెట్టా షురా అని కూడా పిలుస్తారు.

* మరో ఇద్దరు కీలక నేతలు
తాలిబన్లలో మరో ఇద్దరు కీలక నేతలు ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కించుకునే అవకాశం ఉంది. వారే ముల్లా ఖైరుల్లా ఖైర్ఖ్వా, ముల్లా మొహమ్మద్ ఫజల్. వీరిద్దరి వయసు 54 ఏళ్లు. వీరు ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది. గతంలో తాలిబన్లను తరిమికొట్టిన కొన్ని నెలల్లోనే ఈ ఇద్దరినీ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. అయితే అప్పట్లో హక్కానీ నెట్‌వర్క్ ఒక అమెరికా సైనికుడిని బంధించింది. అతడిని విడుదల చేయాలంటే.. ఖైర్ఖ్వా, ఫజల్‌లను విడుదల చేయాలని షరతు విధించారు. ఇలా 2014 మే నెలలో ఈ ఇద్దరూ విడుదలయ్యారు. ఖైర్ఖ్వా కూడా పోపాల్‌జాయ్ తెగకు చెందినవాడే. గత తాలిబన్ పాలనలో ఆయన అంతర్గత మంత్రిగా వ్యవహరించారు. దురానీ తెగకు చెందిన ఫజల్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

* హక్కానీ నెట్‌వర్క్ నుంచి ఎవరు?
జలాలుద్దీన్ హక్కానీ స్థాపించిన ఈ ఉగ్రసంస్థకు ప్రస్తుతం అతడి కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ అధిపతిగా ఉన్నారు. అయితే కొత్త అఫ్గాన్ ప్రభుత్వంలో ఈ సంస్థ పాలుపంచుకుంటుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నా, లేకపోయినా.. ఈ సంస్థ ప్రాబల్యం మాత్రం ప్రభుత్వంపై కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో కీలకమైన వ్యక్తిగా సిరాజుద్దీన్ ఉండనున్నారు. అతడి తండ్రి జలాలుద్దీన్ హక్కానీ తలపై 5 మిలియన్ యూఎస్ డాలర్ల రివార్డ్‌ను ఉండేది. అతడు మరణించిన తరువాత సిరాజుద్దీన్ వారసత్వంగా హక్కానీ నెట్‌వర్క్ బాధ్యతలు స్వీకరించాడు.

ఇది తాలిబన్‌లతో మిత్రబంధం ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ. కానీ ఈ గ్రూపు తాలిబన్‌ కంటే భిన్నమైనది. పాకిస్థాన్ ISIకి మరింత సన్నిహితంగా వ్యవహరిస్తుంది. పాక్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో ఈ గ్రూపుకు శాశ్వత ఆశ్రయాన్ని దాయాది దేశం కల్పించింది. అల్-ఖైదాతో వీరికి బలమైన సంబంధాలు ఉన్నాయి.

* ఇతరులు ఉంటారా?
దోహా చర్చల్లో పాల్గొన్న తాలిబన్ బృందంలో మరో ఇద్దరు కీలక సభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. 2012 నుంచి దోహాలో తాలిబాన్ల రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాజాగా బయటి ప్రపంచానికి కనిపించిన ప్రముఖ తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్.. ఈ జాబితాలో ఉన్నారు. అఫ్గాన్ కొత్త ప్రభుత్వంలో వీరిద్దరూ కీలక బాధ్యతలు చేపట్టవచ్చు.

వీరితో పాటు హక్కానీ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న హక్కానీ సోదరుడు అనాస్, పర్షియన్ నేపథ్యం ఉన్న హజారా తెగకు చెందిన మహమ్మద్ మొహఖిక్, మొహమ్మద్ కరీం ఖలీలి లకు సైతం తాలిబన్ల ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. హజారా తెగ ప్రతినిధుల బృందం ఈ విషయంపై ఇస్లామాబాద్‌కు వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
Published by:Sumanth Kanukula
First published: