Explained: అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది?

అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది? (image credit - reuters)

Afghanistan: అమెరికా లాంటి శక్తిమంతమైన దేశం... తాలిబన్ల నుంచి అప్ఘనిస్థాన్‌ను కాపాడటంలో ఫెయిలైందా? ఎన్నేళ్లైనా పరిస్థితి మారకపోవడంతో... ఇక తన వల్ల కాదని డిసైడైందా? మళ్లీ ఉగ్రవాదం పెరుగుతుందా?

  • Share this:
అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తుది ఘట్టానికి చేరుకుంది. 20 ఏళ్లుగా ఆ దేశంలో మకాం వేసిన తమ బలగాలను వెనక్కు పిలవాలని అమెరికా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంపై పూర్తిగా పట్టుసాధించడంపై తాలిబన్లు దృష్టి పెట్టారు. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు లేకుండానే ముగిసినట్లు భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం అఫ్గాన్‌ భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్న తాలిబన్లు, ఆ దేశంలోని ప్రభుత్వాన్ని కూలదోస్తారా? మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అఫ్గానిస్థాన్‌ను యుద్ధం ఎలా మార్చింది? ప్రస్తుతం ఆ దేశంలో వచ్చిన మార్పులేంటి? భవిష్యత్తు ఎలా ఉండనుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.

* అఫ్గాన్‌పై యూఎస్ ఎందుకు దండెత్తింది?
2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు అఫ్గాన్‌పై దండెత్తాయి. ఆ ఏడాది అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ (WTC Attack)పై అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ దాడిలో 3 వేల మందికి పైగా అమెరికా పౌరులు చనిపోయారు. దీంతో లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికా ఏర్పాట్లు చేసింది. అయితే అల్‌ఖైదా నేతకు అప్పట్లో అఫ్గాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు రక్షణ కల్పించారు. దీంతో తాలిబన్ల ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా అమెరికా ప్రణాళికలు రచించింది. తర్వాత అఫ్గాన్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం, ఆ దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడం.. వంటివి వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ చర్యలను వ్యతిరేకిస్తున్న తాలిబన్లు, సంకీర్ణ దళాల మధ్య సుదీర్ఘ పోరు కొనసాగింది.

Afghanistan, US and Nato troops, Afghanistan war
అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది? (image credit - reuters)


అయితే లాడెన్‌ను హతమార్చిన తరువాత అమెరికా తాలిబన్లపై దాడులను ఆపేసింది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి బలగాలను వెనక్కు రప్పించాలని గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించగా, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సైతం ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం అఫ్గాన్‌ భూభాగాన్ని తాలిబన్లు ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటున్నారు.

* 2001 నుంచి అఫ్గానిస్థాన్‌లో ఎంతమంది మరణించారు?
అమెరికా దళాలు వచ్చిన తరువాత తాలిబన్లు పాకిస్థాన్ సరిహద్ధుల్లోని పర్వత ప్రాంతాలకు వెళ్లి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 20 సంవత్సరాల పోరాటంలో అఫ్గానిస్థాన్‌లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్, బ్రౌన్ యూనివర్సిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అఫ్గాన్‌లో యుద్ధం కారణంగా 20 ఏళ్లలో 3,586 మంది అమెరికా, మిత్ర దేశాల సంకీర్ణ దళాలు, జర్నలిస్టులు చనిపోయారు. సుమారు 69,000 వరకు అఫ్గాన్ భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారు. 51,613 మంది సాధారణ పౌరులు సైతం బలయ్యారు. గాయపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎదురు దాడుల్లో చనిపోయిన తాలిబన్ల సంఖ్య సైతం 51,191 వరకు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లో సైతం పోలీసులు, తాలిబన్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

Afghanistan, US and Nato troops, Afghanistan war
అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది? (image credit - reuters)


ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చనిపోయిన పౌరుల సంఖ్య.. ఒక సంవత్సరం క్రితం కంటే గణనీయంగా పెరిగింది. IED వంటి విధ్వంసకరమైన పేలుడు పరికరాల వాడకం, దాడుల సంఖ్య పెరగడంతో ఎక్కువ హత్యలు నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. 2020లో అఫ్గాన్‌లో నమోదైన పౌర మరణాలలో 43 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.

* శరణార్థులుగా మారిన ప్రజలు
రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధ వాతావరణం నుంచి విముక్తి పొందడానికి కొన్ని లక్షల మంది అఫ్గాన్ వాసులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. కొందరు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందారు. మరికొందరు ఇతర దేశాలకు వలస వెళ్లి తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ఆకలి కష్టాలు, పేదరికంతో సతమతమవుతున్నారు. ఘర్షణల కారణంగా గత సంవత్సరం నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2021లో రెండు లక్షల మంది దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. 2012 నుంచి సుమారు 50 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. యుద్ధం కారణంగా ఎంతోమంది నిరాశ్రుయులై, శరణార్థులుగా మారారు.

Afghanistan, US and Nato troops, Afghanistan war
అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది? (image credit - reuters)


ఆశ్రయం కోసం ఇతర దేశాలకు వెళ్లిన యుద్ధ శరణార్థుల సంఖ్య విషయంలో అఫ్గాన్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ తెలిపింది. సిరియా 6.7 మిలియన్లు, వెనిజులా నాలుగు మిలియన్లు, అఫ్గాన్‌ 2.6 మిలియన్ల మంది శరణార్థులతో.. మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ మంది శరణార్థులు మాత్రమే మళ్లీ అఫ్గాన్‌కు వస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.

* బాలికలు పాఠశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా?
తాలిబన్ల పాలనలో మహిళలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండేవి. బాలికలు ఉన్నత చదువులు చదువుకునేందుకు అనుమతించేవారు కారు. 1999లో ఒక్క బాలిక కూడా మాధ్యమిక పాఠశాలలో చేరలేదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కేవలం 9,000 మంది బాలికలు మాత్రమే ప్రాథమిక పాఠశాలల్లో చేరారు. అయితే తాలిబన్ల అధికారం పతనమైన తరువాత మహిళలు హక్కులు, విద్య పరంగా కొంత ముందడుగు వేశారు. 2003 నాటికి 2.4 మిలియన్ల మంది బాలికలు పాఠశాలల్లో చేరారు. ఆ సంఖ్య ఇప్పుడు 3.5 మిలియన్లకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ప్రస్తుతం మూడో వంతు విద్యార్థులు మహిళలు ఉండటం విశేషం.

అయితే అఫ్గాన్‌లో ఇప్పటికే పాఠశాల విద్యకు 3.7 మిలియన్లకు పైగా పిల్లలు దూరంగా ఉన్నారని పిల్లల స్వచ్ఛంద సంస్థ యునిసెఫ్ చెబుతోంది. వారిలో 60 శాతం మంది బాలికలు ఉన్నారు. కొనసాగుతున్న ఘర్షణలు, బోధనా సౌకర్యాలు లేకపోవడం, మహిళా ఉపాధ్యాయుల కొరత కారణంగా చాలామంది బాలికలు పాఠశాలలకు వెళ్లట్లేదు. అయితే ఇకమీదట తాము బాలికల విద్యను వ్యతిరేకించమని తాలిబన్లు చెబుతున్నారు. కానీ తాలిబన్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో, యుక్త వయసుకు వచ్చిన బాలికలను చదువుకోవడానికి అనుమతించట్లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది.

Afghanistan, US and Nato troops, Afghanistan war
అఫ్గాన్‌ను వీడుతున్న అమెరికా దళాలు... ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండనుంది? (image credit - reuters)


* మహిళా సాధికారత పెరిగిందా?
తాలిబన్ల ప్రభావం తగ్గిన తరువాత విద్య, ఉద్యోగాల్లో అఫ్గాన్ మహిళల ప్రభావం పెరిగింది. ఆ దేశంలో ప్రస్తుతం ఐదు శాతం మంది మహిళలు కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో చదువుతున్నారు. 22 శాతం మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఏకంగా 20 శాతం మంది సివిల్ సర్వెంట్‌ మహిళలు ఉండటం విశేషం. దేశంలో ఎన్నికైన ఎంపీల్లో 27 శాతం మంది మహిళలే ఉన్నారు. 2019 నాటికి సుమారు వెయ్యి మంది మహిళలు సొంతంగా వ్యాపారాలు స్థాపించుకున్నారు.

ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జనాభా 3.9 కోట్లుగా ఉంది. వీరిలో సుమారు 22 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 69 శాతం మందికి మొబైల్స్ ఉన్నాయి. 4.4 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, బ్యాంకింగ్ విషయంలో మాత్రం ఆ దేశం ఇంకా వెనుకబడి ఉంది. దేశంలో 85 శాతం మందికి ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్లు లేవు. కేవలం 23 శాతం మంది మగవాళ్లు, 7 శాతం మహిళలు మాత్రమే బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఫుట్‌బాల్ అంత గోల్డ్‌ఫిష్‌లు... పర్యావరణానికి ప్రమాదకరం అంటూ అధికారుల సరికొత్త ఆదేశాలు

ప్రధాన పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమైంది. అయితే ఈ ఘనత మొత్తం తాలిబన్ల పతనం తరువాతే సాధ్యమైంది. మళ్లీ తాలిబన్లు ఆ దేశంలో అధికారాన్ని స్వాధీనం చేసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్ భవిష్యత్తును ఊహించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Krishna Kumar N
First published: