Explained: అకౌంట్ అగ్రిగేట‌ర్ నెట్‌వర్క్‌ అంటే ఏంటి ? ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలు

ఫ్రతీకాత్మక చిత్రం

కస్టమర్లు, బ్యాంకుల మధ్య డేటా సులభంగా, సురక్షితంగా షేర్ చేసేందుకే అకౌంట్ అగ్రిగేట‌ర్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. అకౌంట్ అగ్రిగేటర్ అనే బ్యాంకింగేతర కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో నడవనుంది.

  • Share this:
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్థిక సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు ఆర్‌బీఐ దేశీయ బ్యాంకింగ్ రంగంలో అనేక సరికొత్త మార్పులను తీసుకు వస్తోంది. తాజాగా అకౌంట్ అగ్రిగేట‌ర్ నెట్‌వర్క్‌ను పరిచయం చేసింది. కస్టమర్లు, బ్యాంకుల మధ్య డేటా సులభంగా, సురక్షితంగా షేర్ చేసేందుకే అకౌంట్ అగ్రిగేట‌ర్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. అకౌంట్ అగ్రిగేటర్ అనే బ్యాంకింగేతర కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో నడవనుంది. ఇప్పటికే ఈ కంపెనీలో ఎనిమిది ప్రధాన బ్యాంకులు చేరాయి. ఫిన్‌టెక్ ఇండస్ట్రీని సమూలంగా మార్చేయబోతున్న అకౌంట్ అగ్రిగేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* అకౌంట్ అగ్రిగేటర్ ఏం చేయనుంది?
కొత్తగా లోన్ తీసుకోవాలన్నా.. జీవిత బీమా తీసుకోవాలన్నా.. కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అవసరం అయ్యే డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంకులో సమర్పించడం కోసం చాలామంది పలుమార్లు తిరగాల్సి వస్తుంది. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యుగంలో కూడా కస్టమర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వచ్చు కానీ అది కూడా భారంగా మారిపోయింది.

అయితే ఇకపై అకౌంట్ అగ్రిగేటర్ కస్టమర్ల మొత్తం డేటాను ఒకే చోట ఏకీకృతం చేస్తుంది. ఒకే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా వివిధ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్, కస్టమర్ల మధ్య డేటాను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. తద్వారా కస్టమర్లకు తరచూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. అకౌంట్ అగ్రిగేటర్ ఎకోసిస్టమ్ కలెక్టివ్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ డిజిసహమతి ( DigiSahamati Foundation) ప్రకారం.. అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అనేది కస్టమర్లు తమ డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేందుకు సహాయపడుతుంది.

* అకౌంట్ అగ్రిగేటర్ ఎలా పనిచేస్తుంది?
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో (NBFC) అకౌంట్ అగ్రిగేటర్ అనేది ఒక కొత్త కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫైనాన్షియల్ డేటా షేరింగ్ కోసం ఆర్‌బీఐ ఈ కంపెనీకి అనుమతినిచ్చింది. అకౌంట్ అగ్రిగేటర్ అనేది వివిధ ఐటీ వ్యవస్థలు, ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించి ఫైనాన్సియల్ సెక్టార్ రెగ్యులేటర్స్ అంతటా విస్తరిస్తుంది. వివిధ ఆర్థిక సంస్థల్లోని కస్టమర్ ఫైనాన్షియల్ డేటాను ఏకీకృతం చేస్తుంది. బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు తమ కస్టమర్ డేటాను సేకరిస్తుంది. అలాగే కస్టమర్లకు డేటాను చేరవేస్తుంది.

అకౌంట్ అగ్రిగేటర్ ఒక పోర్టల్ లేదా యాప్ కాగా.. దీని ద్వారా కస్టమర్ తన ఫైనాన్షియల్ డేటాను పంచుకోవచ్చు. అకౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్‌లో.. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ (FIP), ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్ (FIU), టెక్ సర్వీస్ ప్రొవైడర్ అనే మూడు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి.

* ఇది ఎంత సురక్షితం?
అకౌంట్ అగ్రిగేటర్ కేటగిరీని డేటా యాక్సెస్ ఫిడిషియరీ (DAF) అని పిలుస్తారు. దీన్ని డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ (DEPA) సులభతరం చేస్తుంది. డీఏఎఫ్ లు డేటా బ్లైండ్ అని... అవి యూజర్ డేటాను చూడలేవని డిజిసహమతి వెల్లడించింది. ఎన్క్రిప్టెడ్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయని వివరించింది. అకౌంట్ అగ్రిగేటర్‌లు తొలత బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు, పెన్షన్ ఫండ్‌లు వంటి ఆస్తి ఆధారిత డేటాను మాత్రమే అందిస్తాయి. ఐటీ వ్యవస్థలలో అనధికార యాక్సెస్, చేంజ్, డేటా వ్యాప్తి లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని ఆర్బిఐ వెల్లడించింది.

* సైన్ అప్ చేయడం ఎలా?
మొబైల్ ఫోన్/డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అకౌంట్ అగ్రిగేటర్ సేవలను పొందొచ్చు. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యూజర్ తమ బ్యాంక్ వివరాలను బ్యాంక్ FIP ద్వారా ఆన్-బోర్డ్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఆమె FIU తో షేర్ చేసుకోవచ్చు.

* భారతదేశంలో అకౌంట్ అగ్రిగేటర్లు ఏవి?
ఫిన్వు, వన్‌మనీ, సీఎఎమ్‌ఎస్ ఫిన్‌సర్వ్, ఎన్‌ఈఎస్‌ఎల్ అనే నాలుగు అకౌంట్ అగ్రిగేటర్ యాప్‌లు ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌లను పొందాయి. అయితే ఫోన్‌పే, పెర్ఫియోస్, యోడ్లీలకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.
Published by:Kishore Akkaladevi
First published: