క్రిప్టో కరెన్సీలో Stablecoin అంటే ఏంటి...అమెరికా దీనిపై ఎందుకు దృష్టి పెడుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

USDC అనే స్టెబుల్‌కాయిన్‌ను రన్ చేసే కాయిన్‌బేస్ సంస్థ వెల్లడించింది. డిజిటల్-అసెట్ ఫ్లెక్సిబిలిటీ, సంప్రదాయ కరెన్సీలు అందించే స్థిరత్వం రెండూ కలిసినవే ఈ స్టెబుల్‌కాయిన్స్ అని తెలిపింది.

  • Share this:
డిజిటల్ టెక్నాలజీ ద్వారా పనిచేసే క్రిప్టో కరెన్సీని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. అయితే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారులు స్టెబుల్‌కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ గురించి ఆరాతీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిట్ కాయిన్‌కు భిన్నంగా ఉండే ఈ క్రిప్టో కరెన్సీ గురించి చర్చించడానికి గత వారం అధికారులు ఇండస్ట్రీ వర్గాలను కలిశారని.. వీటి వల్ల ప్రయోజనాలు, నష్టాలు, అవకాశాల గురించి ఆరా తీశారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. స్టెబుల్‌కాయిన్ మార్కెట్ విలువ ఇప్పటికే 125 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో అమెరికా ట్రెజరీ అధికారులు వాటిని రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్టెబుల్‌కాయిన్ అంటే ఏంటి?
మొదటి క్రిప్టోకరెన్సీ అయిన ఒక బిట్‌కాయిన్ విలువ సెప్టెంబర్ మధ్యలో రూ. 39 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో విలువ పెరగడంతో దీనిపై దృష్టిపెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే బిట్‌కాయిన్స్‌ విలువ ఎప్పటికప్పుడు ఒడిదొడుకులకు గురవుతుంది. దీని విలువ తరచుగా మారుతుంది. దీంతో వీటిని ఖర్చు చేసేవారు నష్టాల గురించి భయపడుతుంటారు. ఏదైనా ట్రాన్సాక్షన్ కోసం వీటిని ఉపయోగించిన తరువాత బిట్‌కాయిన్ విలువ పెరిగితే, ఆ మేరకు తాము నష్టపోతుంటామని వాటి యజమానులు బాధపడుతుంటారు. అందువల్ల సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే ఇతర ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. బిట్‌కాయిన్‌లు, ఇతర క్రిప్టోకరెన్సీలపై ఆధారపడటం సరికాదని నిపుణులు చెబుతుంటారు.

వివిధ దేశాలకు చెందిన ఫియట్ కరెన్సీ లేదా గవర్నమెంట్ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టోలు నమ్మదగినవి కాదు. వీటి విలువ అస్థిరంగా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు జారీ చేసే కరెన్సీ విలువ స్థిరంగా ఉంటుంది. అయితే విస్తృత డిజిటల్ ప్రయోజనాలను అందిస్తూనే, కరెన్సీ విలువలో స్థిరత్వాన్ని అందించే స్టెబుల్‌కాయిన్.. ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక స్టెబుల్‌కాయిన్ అనేది క్రిప్టోకరెన్సీ. కానీ దీని విలువ యూఎస్ డాలర్ వంటి ఫియట్ కరెన్సీ, బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాలు, ఇతర అసెట్ క్లాసులకు లింక్ అయ్యి ఉంటుంది.

ఇది ఎలా పని చేస్తుంది ?
వీటి పనితీరును USDC అనే స్టెబుల్‌కాయిన్‌ను రన్ చేసే కాయిన్‌బేస్ సంస్థ వెల్లడించింది. డిజిటల్-అసెట్ ఫ్లెక్సిబిలిటీ, సంప్రదాయ కరెన్సీలు అందించే స్థిరత్వం రెండూ కలిసినవే ఈ స్టెబుల్‌కాయిన్స్ అని తెలిపింది. రోజువారీ అవసరాలకు డిజిటల్ మనీగా ఉపయోగించడం దగ్గర నుంచి ఎక్స్ఛేంజీలలో ట్రాన్స్‌ఫర్ చేయడం వరకు ప్రతి అవసరానికీ వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.

US డాలర్, యూరో లేదా జపనీస్ యెన్ వంటి మానిటరీ రిజర్వ్ అసెట్స్ నుంచి స్టెబుల్‌కాయిన్స్‌కు స్థిరత్వం లభిస్తుంది. Tether, TrueUSD వంటి అత్యంత ప్రజాదరణ పొందిన స్టెబుల్‌కాయిన్‌లను ఫియట్-కొల్లేటరైజ్డ్ కరెన్సీలుగా గుర్తిస్తారు. స్టెబుల్‌కాయిన్లను జారీ చేసే సంస్థ వద్ద ఉన్న డాలర్ డిపాజిట్ల ద్వారా వీటి విలువలో స్థిరత్వం కొనసాగుతుంది. ఒక స్టెబుల్‌కాయిన్ విలువ ఒక అమెరికన్ డాలర్‌గా ఉంటుంది. సంస్థ జారీ చేసిన అన్ని స్టెబుల్‌కాయిన్‌లను కవర్ చేయడానికి ఆ మేరకు US డాలర్లను సదరు సంస్థ నిల్వ చేస్తుంది. అందువల్ల ఒక నిర్దిష్ట స్టెబుల్‌కాయిన్ చెలామణి విలువ ఒక మిలియన్ డాలర్లుగా ఉంటే.. దాన్ని జారీ చేసే సంస్థ వద్ద దానికి సమానంగా 1 మిలియన్ యూఎస్ డాలర్లు రిజర్వ్‌గా ఉండాలి.

వీటికి భిన్నంగా నాన్- కొల్లేటరైజ్డ్ స్టెబుల్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఇవి మరొక క్రిప్టోకరెన్సీకి లేదా అల్గారిథమ్‌కు లింక్ అయ్యి ఉంటాయి. మరొక క్రిప్టోకరెన్సీకి లింక్ అయిన స్టెబుల్‌ కాయిన్ విలువలో స్థిరత్వం కోసం సంస్థలు ఓవర్-కొల్లేటరైజేషన్‌ పద్ధతిని పాటిస్తాయి. అంటే సంస్థలు జారీ చేసే స్టెబుల్ కాయిన్ల కంటే ఎక్కువ హోల్డింగ్ క్రిప్టోకరెన్సీని ఆ సంస్థ కలిగి ఉంటుంది. ఉదాహరణకు.. రెండు, మూడు డాలర్ల విలువైన ఇతర క్రిప్టోకరెన్సీకి ఒక డాలర్ విలువ ఉండే స్టెబుల్‌కాయిన్‌ జారీ చేస్తుంది. ఈ అదనపు విలువ కారణంగా స్టెబుల్ కాయిన్ విలువ హెచ్చుతగ్గులకు గురికాదు.

వీటి ప్రయోజనాలు ఏంటి ?
క్రిప్టోకరెన్సీల ద్వారా విస్తృతమైన బ్యాంకింగ్‌ ప్రయోజనాలు ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవస్థను వికేంద్రీకరించడంతో పాటు వివిధ అవసరాల కోసం సులభంగా డబ్బు ఖర్చుచేసే సౌలభ్యాన్ని క్రిప్టోల ద్వారా పొందవచ్చు. బిట్‌కాయిన్, ఈథర్ వంటి క్రిప్టో కరెన్సీలు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. విలువలో అస్థిరత, తీవ్రమైన హెచ్చుతగ్గుల కారణంగా వీటిని చెల్లింపుల కోసం వాడే టోకెన్లుగా కాకుండా ఒక ఆస్తిగా ఎక్కువ మంది భావిస్తున్నారు.

అయితే US డాలర్ వంటి స్థిరమైన కరెన్సీకి లింక్ అయ్యి ఉండటం వల్ల స్టెబుల్‌కాయిన్స్‌కు కేంద్ర బ్యాంకుల పర్యవేక్షణ ఉంటుంది. విలువలో స్థిరత్వం కారణంగా స్టెబుల్‌కాయిన్‌లు డిజిటల్ లావాదేవీలకు మరింత విశ్వసనీయమైన మార్గంగా మారుతున్నాయి. స్టెబుల్‌కాయిన్‌ల ద్వారా లావాదేవీలు చేయడానికి బ్యాంకు అకౌంట్ అవసరం ఉండదు. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బును సులభంగా, క్షణాల్లోనే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సంప్రదాయ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఛానెల్‌ల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి అయ్యే ఖర్చు సైతం తగ్గుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరగడంతో పాటు ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది.

స్టెబుల్‌కాయిన్‌లను అమెరికా అధికారులు ఎందుకు పరీక్షిస్తున్నారు?
స్టెబుల్ కాయిన్ల ప్రయోజనాల దృష్ట్యా వీటికి ఆదరణ లభిస్తోంది. అయితే ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిప్టోకరెన్సీలు కావడంతో అధికారులు వీటిపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలను ప్రోత్సహించడానికి, పెట్టుబడిదారులను దెబ్బతీసేందుకు వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఓకేసారి తమ స్టెబుల్ కాయిన్లను తిరిగి US డాలర్లకు మార్చడానికి ప్రయత్నిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుమానిస్తున్నారు. ఇలాంటి పరిణామాల గురించి చర్చించేందుకు అధికారులు పరిశ్రమ వర్గాలతో సమావేశమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
Published by:Krishna Adithya
First published: