వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా మరికొన్ని అసాధారణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం, అనుమానితుడు గంగాధర్ రెడ్డి స్టేట్మెంట్లు పెను కలకలానికి దారి తీశాయి..
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, అంతకంటే కలకలం రేపే తీరుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case)లో తాజాగా మరికొన్ని అసాధారణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం ఇదేనంటూ ‘ఆంధ్రజ్యోతి’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. కేసును సీబీఐకి అప్పగిస్తే, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని సీఎం జగన్ (AP CM Jagan) అన్నట్లు సునీత స్టేట్మెంట్లో పేర్కొందని కథనంలో రాశారు. మరోవైపు ఇదే కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి.. వివేకా కూతురు సునీతనే ప్రలోభాలకు గురిచేసిందని చెప్పిన వార్త ‘సాక్షి’లో ప్రధానంగా వచ్చింది. మొత్తంగా వైసీపీ ఎంపీ, ఇతర నేతలను ఇరుకున పెడుతూ సీబీఐ వేసిన చార్జిషీటును సవాలు చేస్తూ న్యాయపోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించినట్లు మరికొన్ని వార్తలు వస్తున్నాయి. వివరాలివి..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో తొలి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూ, న్యాయపోరాటం చేస్తోన్న కూతురు డాక్టర్ సునీతా రెడ్డి 2020, జులై 7న సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఇదేనంటూ మీడియాలో రిపోర్టులు వచ్చాయి. ఆ స్టేట్మెంట్ లో సునీత సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి.‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్)ను కోరా.. అనుమానితుల పేర్లు కూడా చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడైపన్నెండు కేసులు అవుతాయ్’ అని సీఎం జగన్ మాట్లాడారని సునీత పేర్కొన్నారు.
వివేకా హత్య కేసు అనుమానితుల జాబితాలో.. ఈసీ గంగిరెడ్డి (జగన్ భ్యా భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ కోప్పడ్డారని, హత్య వార్తపై భారతి స్పందనలో బాధ లేదని, హత్యను గుండెపోటుగా అభివర్ణిస్తూ సాక్షి మీడియాలో కొన్ని గంటలపాటు కథనాలు ప్రసారం చేశారని, హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీకి లాభం చేకూరిందని, ఏళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోనందుకే న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని డాక్టర్ సునీత స్టేట్మెంట్ లో చెప్పినట్లు కథనంలో రాశారు. ఇదిలా ఉంటే,
వివేకా హత్య కేసులో మరో అనుమానితుడు కల్లూరు గంగాధర్‌రెడ్డి అలియాస్ కొవ్వేటు గంగాధర్ ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసుతో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో కుట్ర పూరితంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని గంగాధర్‌రెడ్డి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు, ఇదే వాంగ్మూలమంటూ వెలుగులోకి వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. సీబీఐ వాళ్లు విచారణకు పిలిస్తే వెళ్లానని, తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారని గంగాధర్ రెడ్డి చెప్పిన విషయాలను సాక్షిలో ప్రచురించారు. అంతేకాదు,
తనతో పాటు అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం వివేకానందరెడ్డి కుమార్తె సునీత, జగదీశ్వర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్యలో ఆ ముగ్గురి ప్రమేయం ఉందని చెప్పాలంటూ జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు వారు రూ.20 వేల నగదు సైతం ఇచ్చారన్నారు. తాము చెప్పిన విధంగా సీబీఐ అధికారులతో చెబితే రూ.50 లక్షల డబ్బుతో పాటు కారు, తన కాలి చికిత్స ఖర్చులు భరిస్తామంటూ ప్రలోభపెట్టారని గంగాధర్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా సీబీఐ చార్జిషీటు తర్వాత వివేకా హత్య కేసులో రాజకీయ సంచలనాలెన్నో చోటుచేసుకుంటుండటం గమనార్హం. ఈ వ్యవహారంలో వైసీపీ న్యాయపోరాటానికి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.