YS Viveka Murder case: వివేకానంద హత్య కేస్ లో తెరపైకి కొత్త పేర్లు.. ఆ కుటుంబంపై అనుమానాలు

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడేనా.. తాజాగా సీబీఐ అధికారులు 25 రోజుల్లో ఏం తేల్చారు.. ఈ కేసులో కొత్త పేర్లు ఎందుకు తెరపైకి వస్తున్నాయి..? ఒకే కుటుంబాన్ని పదే పదే ఎందుకు విచారిస్తున్నారు..?

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. గతంలో కంటే సీబీఐ ఈ సారి దూకుడు పెంచి విచారణ చేస్తోంది. గడిచిన 25 రోజులుగా కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ తుల్లాలను ఇప్పటికే పలుసార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోగా కొత్తగా ఒక కుటుంబం తెర మీదకు వచ్చింది. పులివెందులకి చెందిన కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని మొత్తం సీబీఐ గత కొన్ని రోజులుగా పదే పదే విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ కుటుంబ సభ్యులనే పదే పదే విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేస్ లో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి? అసలు వివేకాకి, కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి పరిచయం ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

    వివేకానంద రెడ్డి హత్య కేస్ లో సీబీఐ ఈసారి కొత్త కోణంలో విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఇది వరకు గతంలో విచారించిన పాత వ్యక్తులనే మళ్లీ మళ్లీ పిలిచి విచారించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా వివేకా వద్ద డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగి రెడ్డిని విచారించేవారు. ఈసారి వీరితో పాటు పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబంలో సభ్యులందరినీ విచారిస్తున్నారు. వారిని కడప, పులివెందుల కేంద్రాలుగా సాగుతున్న విచారణలో గత 20 రోజులు నుంచి ప్రతి రోజు కృష్ణయ్య యాదవ్ కుంటుంబంలో విచారణకి హాజరవుతుంది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు.

    వైఎస్ వివేకానంద రెడ్డి కేస్ లో పులివెందుల చెందిన ఈ కృష్ణయ్య కుటుంబానికి.. వివేక కుటుంబానికి మధ్య సంబంధం ఏంటంటే.? కృష్ణయ్య యాదవ్ కుటుంబానిది పులివెందుల మండలం మోట్నూంతలపల్లె.. కృష్ణయ్య యాదవ్‌కు భార్య సావిత్రి, కుమారులు సునీల్‌ కుమార్‌, కిరణ్‌ కుమార్‌ ఉన్నారు. వీరు కొన్ని కారణాల రీత్యా పులివెందుల నుంచి అనంతపురం జిల్లా మకాం మార్చారు. అక్కడ కృష్ణయ్య యాదవ్ కుటుంబం బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ లో పూర్తి స్థాయిలో నష్టాలు వచ్చేసరికి అక్కడ ఐపి పెట్టి మళ్ళీ పులివెందుల బాకరపురంకి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చాక ఒక పంచాయితీ వ్యవహారంలో వివేకానందకి, కృష్ణయ్య కుటుంబానికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరి కుటుంబం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి సన్నిహితంగా మెలిగింది. కొన్ని నెలల తర్వాత కృష్ణయ్య యాదవ్ కొడుకు సునీల్ కుమార్ యాదవ్ కి వివేకానంద రెడ్డికి మధ్య డబ్బుల విషయంతో పాటు ఒక పంచాయితీ వ్యవహారంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వివేకానంద రెడ్డికి కృష్ణయ్య యాదవ్ కుటుంబం దూరంగా ఉంటుందని సమాచారం.

    ఆ రెండు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చిన కొన్ని రోజులకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కావడంతో ఈ కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్నికి ఈ కేస్ లో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సీబీఐ విచారిస్తున్నారు. కృష్ణయ్య యాదవ్ కొడుకు సునీల్ యాదవ్ ని ఢిల్లీలో కూడా విచారించి స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య కుటుంబానికి వివేకానంద రెడ్డికి ఏ అంశంలో గొడవ జరిగింది, ఎన్ని రోజులు కలిసి పనిచేశారు లాంటి అనేక అంశాలపై సీబీఐ ఆరా తీస్తోంది.

    ఏమైనప్పటికి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కొత్త వ్యక్తులు తెర మీదక రావడంపైనా అనుమానాలు పెరుగుతున్నాయి. గతంలో కొంతమంది అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పాటు కాల్ డేటా ఆధారంగా ఒక్కొక్కరిగా పిలిచి గత 25 రోజుల నుంచి సీబీఐ విచారిస్తోంది. మరి ఈ సారి సీబీఐ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: