Home /News /crime /

YS VIVEKA DAUGHTER SUNITHA EXPRESSED HER UNHAPPINESS OVER HIS FATHER MURDER CASE INVESTIGATION AK

YS Viveka Murder Case: నా తండ్రిని చంపిందెవరన్న వివేకా కూతురు.. కడప, కర్నూలులో ఇవన్నీ మామూలే అంటూ..

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

YS Viveka Murder Case: సీఎం చిన్నాన్న, మాజీ సీఎం సోదరుడైన వ్యక్తి హత్య జరిగితేనే ఇలా ఉంటే మరి సామాన్యుల సంగతి ఏంటని వైఎస్ వివేకా కూతురు సునీత వ్యాఖ్యానించారు.

    తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఇంతవరకు దోషులను పట్టుకోకపోవడంపై దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుండటంతో.. ఢిల్లీలోని సీబీఐ అధికారులను ఆమె కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత.. వివేకా హత్య కేసులో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారని అన్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో ఇప్పటికీ తెలియదని వ్యాఖ్యానించారు. నాన్న హత్య మిస్టరీగానే మిగిలిపోయిందని వాపోయారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సరిగ్గా జరగడం లేదని అన్నారు. ఈ కేసులో న్యాయం కోసం ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలని సునీత అన్నారు. దోషులను పట్టుకోకపోతే ఈ కల్చర్ ఇలాగే పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు.

    రాష్ట్ర ప్రభుత్వం హంతకులను ఇంతవరకూ పట్టుకోకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ కేసుకు సంబంధించి తాను సీనియర్ అధికారిని కలిసినప్పుడు ఇలాంటి ఘటనలు కడప, కర్నూలులో సాధారణమని అన్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎలా మాట్లాడతారని అన్నారు. అయిందేదో అయిపయింది నువ్వు పోరాడితే నీ పిల్లలపైనా ప్రభావం పడుతుందని తనతో అన్నారని తెలిపారు. సీఎం చిన్నాన్న, మాజీ సీఎం సోదరుడైన వ్యక్తి హత్య జరిగితేనే ఇలా ఉంటే మరి సామాన్యుల సంగతి ఏంటని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధం ఉన్న సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారని ఆరోపించారు. ఇంకెంతమందిపై దాడులు జరుగుతాయోనని భయం వేస్తోందని వ్యాఖ్యానించారు.

    2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ముందు హత్య జరగడంతో.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది.

    సిట్‌తో న్యాయం జరగడం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కొన్ని నెలలుగా ఈ కేసును విచారిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు