ఊహించని ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. క్రాసింగ్ కోసం స్టేషన్‌లో నిలిపిన రైలు దిగి పట్టాలపైకి వెళ్లిన అతడిని మరో రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. దీంతో ప్రయాణికులు అక్కడికి చేరుకుని ఫొటోలు తీస్తున్నారు. ఆ సయమంలో అదే రైలులో ఉన్న ఓ యువతి కూడా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తన ఫోన్‌లో ఫొటో తీసుకుంది. తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయం గురించి చెప్పింది. అయితే తాను తీసిన ఫొటోలను చూస్తున్న ఫొటోలను జాగ్రత్తగా గమనించిన ఆమెకు.. ఆ మృతదేహంపై ఉన్న దుస్తులు తన సోదరుడివేనని అనిపించింది. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ మృతిచెందింది తమ కుమారుడేనని గుర్తించి.. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
రైల్లే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. విద్యాసంస్థలు మూసివేయడంతో కూతురిని తీసుకొచ్చేందుకు శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లాడు. లగేజీ ఎక్కువగా ఉంటుందని భార్య, కుమారుడిని తనతో పాటు తీసుకెళ్లాడు. హైదరాబాద్ నుంచి సోమవారం కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి బయలుదేరారు.
పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. రైలుదిగి, పట్టాలపైకి వెళ్లిన శ్రీనివాస్ కుమారుడు విశాల్‌ను సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విశాల్ మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు, సోదరి విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇక, పెద్దపల్లి ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం విశాల్ మృతదేహాన్ని మందమర్రికి తరలించారు. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురికావడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, Telangana, Train accident