కొన్ని ఆలోచనలు మనుషుల జీవితాలను మార్చేస్తుంటాయి. అప్పటివరకు సజావుగా ఉన్న వాళ్ల జీవితం.. ఒక్క ఆలోచనతో మొత్తం తల్లకిందులవుతుంది. ఢిల్లీకి చెందిన మహ్మద్ జైద్ అనే ఈ యువకుడి జీవితం కూడా ఇలాగే అయ్యింది. ఇతడి పెళ్లి ప్రేమికుల రోజున ఫిక్స్ అయ్యింది. అయితే అతడి జేబులో పైసా కూడా లేకపోవడంతో దొంగతనానికి ప్లాన్ చేసి టీవీలో క్రైమ్ షోలు చూసి దొంగతనాలు చేయడం నేర్చుకుని చోరీకి పాల్పడ్డాడు. అయితే ఢిల్లీ పోలీసులు 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన 2 లక్షల 15 వేల నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ఢిల్లీలోని లాహోరీ గేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ కేసును చేధించారు. జనవరి 18న తెల్లవారుజామున తన భార్య ఇంట్లో ఉండగానే తాను పనికి వెళ్లానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాత్రి 7.30 గంటల సమయంలో తన భార్య కూడా ఇంటి మెయిన్ గేటు మూసివేసి తల్లి ఇంటికి వెళ్లిందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఫిర్యాదుదారు ఇంటికి చేరుకోగా ప్రధాన గేటు తాళం పగలగొట్టి కనిపించింది. గదిలో ఉంచిన అల్మారా తాళం పరిశీలించగా నగదు, నగలు, నల్లరంగు రెడ్మీ మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన లాహోరీ గేట్ పోలీస్ స్టేషన్ 200 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత నిందితుడు మహ్మద్ జైద్ అని నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో మహ్మద్ జైద్ నేరాన్ని ఒప్పుకున్నాడు. నెలకు రూ. 8,000 చిన్న నెల జీతంతో ఒక దుకాణంలో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. వచ్చే ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న తన పెళ్లి ఖరారైందని వారికి వివరించాడు. పెళ్లి ఖర్చులకు, సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి అతనికి డబ్బు కావాలని అనిపించింది. అంత మొత్తం ఎక్కడా దొరక్కపోవడంతో 'సావధాన్ ఇండియా' అనే క్రైమ్ టీవీ ప్రోగ్రామ్, యూట్యూబ్‌లో ఇలాంటి క్రైమ్ బేస్డ్ ప్రోగ్రామ్‌లు చూసి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. అలాగే దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
దొంగిలించడానికి, తాళాలు తెరవడానికి అతను మొదట తాళం చెవిలను సిద్ధం చేసుకున్నాడు. జనవరి 18 సాయంత్రం ఢిల్లీలోని లాహోరీ గేట్‌లోని ఫరాష్ ఖానా ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. తాళం వేసిన ఇంట్లోకి వెళ్లి నగదు, నగలు, మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఆ వెంటనే దొంగలించిన వస్తువులతో ఇంటికి చేరుకున్నాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసు బృందం అతడిని పట్టుకుంది. నిందితుడి వద్ద నుండి 2,15,000/- నగదు, ఒక బంగారు గొలుసు, ఒక జత బంగారు ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరం మరియు మొబైల్ ఫోన్, రెడ్మీ స్వాధీనం చేసుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.