news18-telugu
Updated: March 27, 2020, 2:29 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా ప్రజలు ఆ నిబంధనలు పాటించడం లేదన్న కారణంతో పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఊరూరు తిరిగి బయట ఎవరూ తిరగకుండా చూస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఓ యువకుడు పోలీసులను చూసి పరిగెత్తి ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలొదిలాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దహరివాణం గ్రామానికి చెందిన వీరభద్ర స్వామి(21) గురువారం రాత్రి గ్రామంలోని బసిరె కట్ట వద్ద కొంతమందితో కలిసి కూర్చున్నాడు.
ఈ సమయంలో లాక్డౌన్ పరిస్థితిని చూసేందుకు వాహనంలో ఇస్వి పోలీసులు అటువైపుగా వెళ్లారు. దీంతో వారిని చూసిన వీరభద్ర స్వామితో పాటు పలువురు యువకులు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే వీరభద్ర స్వామి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో మృతుడి తల్లిదండ్రులు జంగమ గౌరమ్మ, సిద్ధయ్య స్వామిల ఆవేదనకు అంతులేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఇస్వి ఎస్ఐ ఆశాలత ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లాక్డౌన్ను సంపూర్ణంగా అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు.
Published by:
Narsimha Badhini
First published:
March 27, 2020, 2:29 PM IST