హోమ్ /వార్తలు /క్రైమ్ /

Honor Killing: నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. ప్రేమ వివాహమే కారణమా..?

Honor Killing: నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. ప్రేమ వివాహమే కారణమా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు.

  కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు ఆమె తల్లిదండ్రులు. పట్టపగలు నడిరోడ్డుపై అల్లుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా, నందవరం మండలం, గురజాలకు చెందిన డేవిడ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని ఇరువురు తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. అయినా నేను డేవిడ్ స్మిత్ నే పెళ్లి చేసుకుంటానని మల్లీశ్వరి తెగేసి చెప్పడంతో తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెను గృహనిర్బంధం చేశారు. దీంతో ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు.

  అనుకున్నట్లుగానే గత నెల 13న ఇంట్లో నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆదోనిలో కొత్త కాపురం పెట్టారు. డేవిడ్ స్మిత్ స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్ లో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీ కోసం హాస్పిటల్ కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో దుండగులు అతడ్ని అడ్డగించారు. తొలుత ఇనుపరాడ్డుతో తలపై కొట్టి ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ డేవిడ్ స్మిత్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న మల్లీశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులే తన భర్తను హత్య చేయించారని ఆమె ఆరోపిస్తోంది.

  ప్రేమ విషయం ఇంట్లో చెప్పినా తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మల్లీశ్వరి.. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇటీవల బెదిరింపులు ఎక్కువవడంతో ఎమ్మిగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఎలాంటి ప్రాణహాని తలబెట్టబోమని కాగితం కూడా రాసిచ్చి సంతకం చేశారని చెప్పింది. పోలీసులు రక్షణ కల్పించడంతో కొత్తకాపురం మొదలుపెట్టినట్లు పేర్కొంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఇంత దారుణానికి ఒడిగట్టారని బోరున విలపించింది.

  కేవలం కులాలు వేరన్న కారణంతోనే తన భర్తను పొట్టన బెట్టుకున్నారని మల్లీశ్వరి చెప్పింది. తన పసుపు కుంకుమ తుడిచేసిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు డేవిడ్ స్మిత్ ను హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తల్లిదండ్రులను అనుమానితులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Crime news, Honor Killing, Kurnool, Love marriage, Murder

  ఉత్తమ కథలు