news18-telugu
Updated: August 14, 2020, 8:58 AM IST
కారులోకి యువతిని ఎక్కిస్తున్న దృశ్యం
పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశారు. కారులో వచ్చిన దుండగులు సోదరి కళ్లముందే ఆమెను ఎత్తుకెళ్లారు. కర్నాటకలోని కోలార్‌లో ఈ దారుణం జరిగింది. యువతి కిడ్నాప్ దృశ్యాలు ఓ దుకాణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోలారులోని ఎంబీ రోడ్డులో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి తెలియకుండా వెనకాలే ఓ ఇన్నోవా కారు ఫాలో అయింది. రోడ్డుపై ఎవరూ లేని సమయంలో కారు నుంచి ఓ వ్యక్తి దిగి, 21 ఏళ్ల యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. బాధితురాలు సోదరి ప్రతిఘటించినప్పటికీ ఆమెను పక్కకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలు సోదరి వెంటనే గల్పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ చేసిన వ్యక్తిని కోలారులోని దేవాంగపేటకు చెందిన శివు (23)గా పోలీసులు గుర్తించారు. ఐతే బాధితరాలు, నిందితుడు ప్రేమించుకుంటున్నారని.. తమ ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కోపంతోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే యువతి కోసం గాలింపు చేపట్టారు. వారి ఆచూకీ తెలిసిందని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 14, 2020, 7:26 AM IST