వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతుకుదామని అనుకున్నారు. అయితే యువతి మైనర్ కావడం.. ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఆమె ఆందోళన చెందింది. దీంతో ప్రియుడితో కలిసి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన ములుగు జిల్లాలో వెంకటాపురం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. వెంకటాపురం మండలంలోని నల్లకుంట గ్రామానికి చెందిన రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్ నగర్‌కు చెందిన ఓ 16 ఏళ్ల యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి బంధువులు.. ప్రేమ వ్యవహారంపై ఆమెను ప్రశ్నించారు. దీంతో తమ ఇంట్లోవాళ్లు రాజేష్‌తో పెళ్లికి నిరాకరిస్తారనే ఆమె భయపడిపోయింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆమె నల్లకుంట గ్రామానికి చేరుకుని రాజేష్‌ను కలిసింది.
అనంతరం రాజేష్‌తో కలిసి నల్లగుంట గ్రామ శివారులోని దేవాదుల పైప్‌లైన్ వద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వీరిద్దరు పురుగుల మందు తాగారు. ఇక, శుక్రవారం తెల్లవారుజామున తాము పురుగుల మందు తాగిన విషయాన్ని రాజేష్.. అతని స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో వారు గ్రామస్తులకు విషయం తెలిపారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పురుగుల మందు తాగిన ప్రేమికులను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్ధితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం రాజేష్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, యువతిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
మరోవైపు తమ కూతురు గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించి భూపాలపల్లి పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువతి కనిపించకుండా పోవడానికి దూరపు బంధువైన రాజేష్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:January 16, 2021, 11:46 IST