news18-telugu
Updated: November 3, 2020, 6:54 AM IST
యువతిపై అత్యాచారం.. తీవ్ర గాయాలతో బాధితురాలు మృతి
Rape in Suryapet: సూర్యాపేట జిల్లా... చింతలపాలెం మండలంలో... ఓ తాండాకు చెందిన యువతిపై కోదాడలో రేప్ జరిగింది. బాధితురాలు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. ఆ యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బాగా చదవాలన్న ఉద్దేశంతో... ఇప్పటి నుంచే పీజీ కోచింగ్ కోసం కోదాడ వెళ్లింది. కోచింగ్ తీసుకుంటూ కోదాడలోని ఓ హాస్టల్లో ఉంటోంది. ఐతే... శుక్రవారం... ఆమె తల్లిదండ్రులకు హాస్టల్ నుంచి కాల్ వెళ్లింది. రిసీవ్ చేసుకుంటే... "మీ అమ్మాయికి ఒంట్లో బాలేదు. అర్జెంటుగా రండి" అని చెప్పారు. గుండెల్లో బండరాయి పడినట్లుగా ఫీలైన తల్లిదండ్రులు కంగారుగా కోదాడ వెళ్లారు. అప్పటికే బాధితురాలికి ప్రాథమిక చికిత్స చేసి... కోదాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ... అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి... ఆమెపై అత్యాచారం జరిగిందనీ... ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడ కూడా సెట్ కాకపోవడంతో... మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తరలిస్తుండగా... బాధితురాలు చనిపోయింది.
ఇదంతా ఎలా జరిగింది? అసలు ఈ దారుణానికి పాల్పడిందెవరు? ఆమెకు రక్షణ ఎందుకు కల్పించలేదు అనే అంశాలు మిస్టరీగా మారాయి. ఇదే సమయంలో... ఆమె తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే ఎంటరై... అంత్యక్రియలను ఆపేశారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి పంపారు.
కోదాడలో ఆమెపై అత్యాచారానికి పాల్పడిందెవరు? ఈ దారుణం హాస్టల్లో జరిగిందా? లేక... బయట జరిగిందా? హాస్టల్ యాజమాన్యం ఎందుకు సైలెంట్‌గా ఉంది? పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? రేప్ జరగడమే కాదు... బాధితురాలు చనిపోయింది కూడా... ఇంత పెద్ద నేరం జరిగినా... మౌనంగా ఎలా ఉంటారన్నది తేలాల్సిన అంశం. ఇప్పుడీ కేసు కోదాడ పోలీసుల పరిధిలో ఉంది. బాగా చదువుకోవాలని వచ్చిన యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఎవరన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 3, 2020, 6:54 AM IST