హైదరాబాద్ నగరంలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. సిటీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తోన్న యువ డాక్టర్ అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మహత్య కేసుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, యువడాక్టర్ సెలైన్ లో విషాన్ని ఇంజెక్ట చేసుకుని, దాన్ని ఒంట్లోకి ఎక్కించుకొనిమరీ బలవన్మరణానికి పాల్పడిన తీరు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటి దాకా వెల్లడైన సమాచారం ప్రకారం..
హైదరాబాద్ అమీర్ పేట శ్యామ్ కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తోన్న రాజ్ కుమార్ (29) బీకేగూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం స్నేహితుడికి ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పాడు. స్నేహితుడు తిరిగి ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన అతను మరో డాక్టర్ శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చాడు. అతను హుటాహుటిన వచ్చి చూడగా రాజ్ కుమార్ తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజ్ కుమార్ తండ్రి కొడిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ రాజ్ కుమార్ సెలైన్ లో విషం ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని కడప జిల్లా బద్వేల్ కు చెందిన అతను కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్ కుమార్ మరణంలో మరేదైనా కోణం ఉందా? అని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.