news18
Updated: November 9, 2020, 6:57 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 9, 2020, 6:57 AM IST
చిన్నప్పుడు స్కూళ్లో మాస్టారు పలకా బలపం పట్టి ఓనమాలు దిద్దిచ్చేటప్పుడు అక్షరాలను ఎంతో నిష్టగా నేర్చుకోవాలని చెబుతారు. అవి నేర్చుకున్న వాళ్లు.. అన్నీ అనుకూలిస్తే మంచి చదువులు చదివి.. ఉద్యోగాలు చేసుకుని హాయిగా ఉంటారు. లేనివాళ్లు రోడ్ల వెంట గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. చేయడానికి పనిలేక నేరాలకు అలవాటై నేరస్థులు గా మిగిలిపోతారు. మనిషికి అక్షర జ్ఞానం అంత ముఖ్యమైంది. ఇక్కడ ఒక నేరస్థుడు.. బాలుడిని కిడ్నాప్ చేసి.. ఆ క్రమంలో అక్షర దోషాలు రాసి అడ్డంగా బుక్కయ్యాడు. అక్షర దోషాలతో బుక్కవడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. యూపీలోని హర్దోయ్ కు చెందిన రామ్ ప్రతాప్ సింగ్ గతనెల 26న ఒక బాలుడిని కిడ్నాప్ చేశాడు. బాలుడిని వదిలేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో భాగంగానే ఆ బాలుడి తండ్రికి ఫోన్ లో మెసేజ్ పెట్టాడు. బాబును వదిలేయాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని, పోలీసులకు ఈ విషయం చెబితే చంపేస్తానని చెప్పాడు. డబ్బులను ఎక్కడికి తీసుకురావాలో కూడా మెసేజ్ లోనే వివరంగా రాశాడు. అయితే ఆ సందేశమే అతడిని పట్టించింది.
బాలుడి తండ్రి ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు సదరు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా అది స్విచాఫ్ అని వచ్చింది. నెంబర్ ఆధారంగా పోలీసులు తమదైన రీతిలో వివరాలు ఆరా తీయగా.. ఆ ఫోన్ కూడా దొంగిలించేదనని తేలింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఒక పదిమందిని పట్టుకొచ్చారు. వారికో చిన్న టెస్ట్ పెట్టారు. ‘నాకు పోలీస్ ఉద్యోగం కావాలి. అందుకోసం హర్దోయ్ నుంచి సీాపూర్ వరకు పరిగెత్తగలను..’ అనే మెసేజ్ హిందీలో రాయాలని చెప్పారు. అందరూ రాశారు. అందులో ఒక వ్యక్తి ‘పోలీస్’.. ‘సీతాపూర్’ అనే పదాలను తప్పుగా రాశాడు. అంతే.. దొంగ దొరికాడు. బాలుడి తండ్రికి మెసేజ్ పెట్టినప్పుడు కూడా దొంగ.. పోలీస్ అనే పదాన్ని ‘పోలీష్’ అని రాశాడు. సీతాపూర్ అనే పదంలోనూ అక్షర దోషాలున్నాయి.
దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.
దాంతో ఆ హంతకుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడి గురించి అడగ్గా.. తన తండ్రి డబ్బులివ్వకపోయేసరికి చంపేశానని చెప్పాడు. ఇది విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ హంతకుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
Published by:
Srinivas Munigala
First published:
November 9, 2020, 6:57 AM IST