తనను నమ్మించి మోసం చేశాడంటూ ప్రకాశం జిల్లా టంగుటూరులో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. హైదరాబాద్ మణికొండకు చెందిన రాజావాసిరెడ్డి సహస్రకు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్‌తో ఫోన్‌లో పరిచయం అయింది. ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా మారారు. ఆ తర్వాత 2014 నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు రెండుసార్లు గర్భస్రావం కూడా చేయించాడని బాధితురాలు ఆరోపించింది. తాము సహజీవనం చేస్తున్న క్రమంలో అరవింద్ కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టానని ఆమె తెలిపింది. తనకు అప్పులు ఉన్నాయని, అవన్నీ తీర్చేస్తే పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో తాను రూ.70లక్షలు చెల్లించినట్టు తెలిపింది. తన వద్దే కాకుండా తనకు తెలియకుండా ఫ్రెండ్స్ వద్ద కూడా మరో రూ.6లక్షలు అప్పులు చేశాడని ఆరోపించింది.
ఈ క్రమంలో 2018 డిసెంబర్ 8వ తేదీన తన తండ్రి చనిపోయాడని చెప్పి అరవింద్ టంగుటూరు వచ్చేశాడని, అప్పటి నుంచి తాను ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడని తెలిపింది. దీంతో బాధితురాలు ఏకంగా టంగుటూరులోని ప్రియుడి ఇంటికి వచ్చి అక్కడ ధర్నాకు దిగింది. ఇదే విషయంపై హైదరాబాద్‌లో, ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. తనకు తల్లిదండ్రులు లేరని, అరవింద్‌తో పెళ్లిని కోరుకుంటున్నానని చెప్పింది. బాధితురాలికి మహిళా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Prakasham dist