WOMEN COMMITTED SUICIDE IN PEDDAPALLI GOVT HOSPITAL BATHROOM AFTER GIVING BORT TO BABAY BOY HERE IS WHAT HAPPENED MKS
peddapalli : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. ఆస్పత్రి బాత్రూమ్లో ఎందుకమ్మా అలా చేశావ్!
మృతురాలు ఉమ, పెద్దపల్లి ఆస్పత్రి వద్ద కుటుంబీకుల ఆందోళన
పెళ్లయిన 12 ఏళ్ల తర్వాతగానీ ఆమె గర్భవతి అయింది.. ఇన్నేళ్ల ప్రార్థనలు ఫలించాయన్నట్లుగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. కానీ సిజేరియన్ గాయాల గొప్పిని తట్టుకోలేకోయింది.. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆమెకు కుట్లు వేశారు డాక్టర్లు.. సోమవారం మూడో సారి కుట్లు వేయాల్సి ఉండగా, నొప్పి భరించలేక ఆస్పత్రి బాత్ రూమ్ లో బలవన్మరణానికి పాల్పడిందామె..
పెళ్లయిన పుష్కరకాలానికి ఆమె కడుపు పండింది.. పిల్లలు లేరనే బాధను దూరం చేసుకుంటూ పండంటి మగ బిడ్డను కనింది.. కుటుంబమంతా ఆనందోత్సాహాలు జరుపుకొంటుండగా.. అనూహ్య కారణంతో ఆ బాలింత ఆస్పత్రి బాత్రూమ్లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చావుకు కారణం వైద్య సిబ్బంది నిర్లక్షమేనని కుటుంబీకులు ఆందోళనలకు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాలివి..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రి బాత్రూమ్లోనే ఓ బాలింత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ఆమె గర్భవతి అయింది. నెలలు నిండటంతో కుటుంబీకులు ఆమెను పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చారు..
డిసెంబర్ 11న ఉమ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. సిజేరియన్ కుట్ల వేసిన కారణంగా 10 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. అయితే సిజేరియన్ కుట్లు సరిగా పడకపోవడంతో ఆమెకు విపరీతమైన నొప్పి కలిగింది. డాక్టర్లకు చెప్పడంతో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి కుట్లు వేశారు. కానీ
కుట్ల నొప్పులు తగ్గకపోగా ఇంకా పెరిగాయి. రెండోసారి వేసిన కుట్లు కూడా సరిగా లేకపోవడంతో సోమవారం మళ్లీ ఆమెకు కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే ఆ గాయాల బాధ తట్టుకోలేక ఉమ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకొంది. ఉదయం బాత్రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది.. అక్కడ వేలాడుతోన్న ఉమను చూసి షాకయ్యారు. సిజేరియన్ గాయాల నొప్పి భరించలేకే ఉమ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వలనే ఉమ చనిపోయిందంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.