SUV Accident : వేగంగా వచ్చిన ఓ కారు ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని అశోక్ విహార్ లో నివసించే పూనమ్ భాటియా(45)..21 ఏళ్ల కుమారుడు వాట్స్ తో కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున స్కార్పియో కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. కొడుకు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే సత్యవతి ఫ్లైఓవర్ పైకి రాగానే కారును నడుపుతున్న కుమారుడు దానిపై నియంత్రణ కోల్పోయాడు. ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న పూనమ్ భాటియా ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కారు నడుపుతున్న ఆమె కుమారుడు వాట్స్ కూడా గాయపడ్డాడు. కాగా, ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గాయపడిన తల్లీ, కుమారులను హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి పూనమ్ భాటియా మరణించింది.
తెల్లవారుజామున 5 గంటలకు, సత్యవతి ఫ్లైఓవర్ భరత్ నగర్ పోలీస్ స్టేషన్ కి ప్రమాదానికి సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగాని తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన స్కార్పియో తునాతునకలైన స్థితిలో కనిపించిందని చెప్పారు. వెంటనే తల్లీ కొడుకులిద్దరినీ దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అక్కడ మహిళ గాయాలతో మరణించిందని.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడని ఉషా రంగాని తెలిపారు. కుమారుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారన్నారు.
ALSO READ Accident : లారీ బోల్తా..8మంది వలస కూలీలు దుర్మరణం
అతడు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించిన తర్వాత కుమారుడి వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని, పోస్ట్ మార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. సెక్షన్ 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపరచడం), మరియు 304 A (నిర్లక్ష్యంగా మరణానికి కారణం) కింద కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ప్రమాదం జరిగిన తీరును అధికారులు పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Delhi, WOMAN