news18-telugu
Updated: November 19, 2019, 7:48 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఎంతోమంది అమాయకులను బలితీసుకున్న కాల్ మనీ కేటుగాళ్లు... ఇంకా తమ కార్యకలాపాలను కొనసాగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని... తన కోరిక అయినా తీర్చాలని అజిమున్నీసా అనే మహిళపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చారు. వారి ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు... ఎస్పీ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ట్రజరీ కార్యాలయంలో అజిమున్నీసా సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.వినుకొండ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో ఇన్నమూరి మాధవరావు నుంచి అజిమున్నీసా మూడు లక్షలు అప్పు తీసుకుంది. బదులుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులను మాధవరావు తీసుకున్నారు. అప్పటి నుండి నెలనెలా వడ్డీతో పాటు అసలు కూడా చెల్లిస్తూ ఏడున్నర లక్షల రూపాయలను చెల్లించింది.
అయినా ఇంకా చెల్లించాలంటూ ఆమెను వేధించాడు. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని, తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించక పోవడంతో ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 19, 2019, 7:48 PM IST