ఓ మహిళపై దాడి చేసిన గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె బట్టలు తీసేసి.. నగ్నంగా ఊరేగించారు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్ డుమ్కా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె పెళ్లైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే కారణంతో గ్రామస్తులు దాడి చేసినట్టుగా పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. వివరాలు.. డుమ్కా జిల్లాలోని రాణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇది వరకే పెళ్లి జరిగింది. ఆమె పెళ్లైన మరో వ్యక్తితో కలిసి పారిపోయింది. దీంతో ఆ వ్యక్తి భార్య కుటుంబం, బంధువులు వీరి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి భార్య కుటుంబ సభ్యులు.. మహిళను పట్టుకున్నారు.
అనంతరం ఆమెపై దాడి చేశారు. మెడలో బూట్ల దండ వేసి.. బట్టలు తీసేసి.. ఊరేగించారు. మహిళను నగ్నంగా ఊరేగించడాన్ని చూసినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇక, నిందితులు.. తన వద్ద నుంచి రూ. 25,000 దొంగిలించినట్టుగా బాధితురాలు ఆరోపించింది.
ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత మహిళతో కలిసి పారిపోయిన వ్యక్తితో పాటుగా, అతని భార్య పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 12 మందిపై ఐపీసీ సెక్షన్లు 148, 504, 506, 354-బీ, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను పట్టుకున్నామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.