ఓ మహిళ తనకు జరిగిన ఘోరమైన అవమానాన్ని తట్టుకోలేపోయింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గ్రామంలో నగ్నంగా ఊరేగించడం, చెప్పుల దండలతో కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దక్షిణ త్రిపురలోని సబ్రూమ్లోని బేటాగా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం కోర్టు దృష్టికి రావడంతో.. త్రిపుర హైకోర్టు దీనిని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వివరాలు.. బాధితు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిపేలా ఓ వీడియోను మధ్యవర్తులు సమావేశం సందర్భంగా పెద్ద తెరపై ప్రదర్శించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ తర్వాత మంగళవారం రోజున మహిళ ఇంటి వద్దకు చేరిన కొందరు ఆమెపై చెప్పులు, షూలతో దాడి చేశారు. ఆమె వెంట్రుకలను కత్తిరించారు. అనంతరం నగ్నంగా ఆమెను ఊరేగించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ కుటుంబ సభ్యులు ఇలా చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన జీవితానికి ముగ్గింపు పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందుకు సంబంధించిన నివేదికల ఆధారంగా జస్టిస్ ఎఏ కురేషి, జస్టిస్ ఎస్ తలాపాత్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సౌత్ త్రిపుర ఎస్పీ, సబ్రూమ్ ఎడీపీవో ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని నోటీసులు జారీచేసింది. ఈ కేసును కోర్టు మానవ హక్కుల ఉల్లంఘనగా అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నవారిని ఒక్క రోజులోనే ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని కోరింది.