ఆయనకు 51.. ఆమెకు 45.. ఈ వయసులో ఎఫైర్ నడుపుతుందే కాకుండా.. ఏం పనయ్యా ఇది..!

పోలీసుల అదుపులో విష్ణు, అంజిలమ్మ

  • Share this:
    మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణ శివారులో ఉన్న భీమా కాల్వ సమీపంలో మార్చి 29న ఓ మహిళను హత్యచేసి దహనం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ మహిళను గద్వాల జిల్లా అయిజకు చెందిన ఆలె విష్ణు(51), పంచదేవ్‌పహాడ్ గ్రామానికి చెందిన అంజిలమ్మ(45) కలిసి హత్య చేసి కాల్చివేసినట్లు పోలీసులు తేల్చారు. కాళ్ల కడియాల కోసమే హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా అయిజకు చెందిన ఆలె విష్ణు(51) మక్తల్ సమీపంలోని ఓ పొలాన్ని మూడేళ్ల నుంచి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంచదేవ్‌పహాడ్‌కు చెందిన అంజిలమ్మతో పరిచయం ఏర్పడింది. అంజిలమ్మ భర్త చనిపోయాడు. దీంతో.. విష్ణు, అంజిలమ్మ సహజీవనం చేస్తున్నారు. పొలంలో పంట సాగు చేసేందుకు పెట్టుబడి కోసం డబ్బుల్లేక అంజిలమ్మ కాళ్ల కడియాలను అమ్మి విష్ణు పెట్టుబడి పెట్టాడు. పంట నష్టపోయి పెట్టుబడి డబ్బులు కూడా తిరిగి రాలేదు. దీంతో.. అప్పటి నుంచి తన కాళ్ల కడియాలు కావాలని విష్ణుపై అంజిలమ్మ ఒత్తిడి చేసింది. అయితే.. అంజిలమ్మ కాళ్ల కడియాలు అడిగిన సందర్భంలో ఆమె సమీప బంధువైన చిట్యాల లింగమ్మ కాళ్లకు కడియాలు ఉన్న విషయాన్ని విష్ణు గమనించాడు. లింగమ్మను ఎలాగైనా హతమార్చి ఆమె కాళ్ల కడియాలను తీసుకొచ్చి అంజిలమ్మకు ఇవ్వాలని విష్ణు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. మార్చి 28న మక్తల్‌కు వచ్చిన లింగమ్మతో కలిసి విష్ణు, అంజిలమ్మ మద్యం సేవించారు. భీమా కాల్వ పక్కకు తీసుకెళ్లి లింగమ్మ గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు. భయంతో లింగమ్మ కేకలు వేయడంతో విష్ణు తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. ఆ తర్వాత గొంతుపై పొడిచి హత్య చేశాడు.

    ఆమె కాళ్ల కడియాలు, చెవి కమ్మలు కటింగ్‌ప్లేర్‌తో తీసుకుని బైక్‌‌లో ఉన్న పెట్రోల్‌ను బీర్‌బాటిల్‌లో నింపుకుని లింగమ్మ శవంపై పోసి నిప్పంటించారు. అక్కడి నుంచి.. రాయచూరు, నారదగడ్డ జిల్లాకు వెళ్లారు. కాగా.. మార్చి 28న మక్తల్ పట్టణంలో ఆలె విష్ణు, అంజిలమ్మ, హత్యకు గురైన లింగమ్మ మద్యం సేవించేందుకు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కాళ్ల కడియాలు, చెవి కమ్మలు, బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: