మహిళను దారుణంగా చంపి.. ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లారు.. మరీ ఇంత ఘోరమా..

ప్రతీకాత్మక చిత్రం

బంగారం కోసమే ఆమెను దుండగులు చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. పక్క రూమ్‌లో అద్దెకు ఉంటున్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తారు.

  • Share this:
    మనుషులు మృగాల్లా మారుతున్నారు. మనుషుల కంటే మృగాలే నయమన్నట్లుగా.. దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం సాటి మనుషుల ప్రాణాలను తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే జరిగింది. ఇంట్లో ఒంటిరిగా ఉన్న మహిళలకు చంపేసి.. ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సువర్ణ అనే 48 ఏళ్ల మహిళ చటాన్‌పల్లిలోని రాంనగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు సువర్ణ ఇంట్లోకి చొరబడి.. ఆమెను చంపేశారు. తాడును గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారం నగలను ఎత్తుకెళ్లారు.

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బంగారం కోసమే ఆమెను దుండగులు చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. పక్క రూమ్‌లో అద్దెకు ఉంటున్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పక్కింటికి తాళం వేసుకొని ఉండడంతో వారి అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి వివరాలు సేకరించి.. వారి కోసం గాలిస్తున్నారు. షాద్ నగర్ చట్టు పక్కల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒంటరి మహిళను దుండగులు హత్య చేయడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: