కరోనా మహమ్మారి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మంటగలుపుతోంది. ఎవరైనా చనిపోతే నలుగురు కలిసి దహన సంస్కారాలు నిర్వహించేవారు ఒకప్పడు. ప్రస్తుత కరోనా సమయంలో ఆ పరిస్థితి లేకుండాపోయింది. అనారోగ్యంతో మరణించినా దగ్గరకు రావడం లేదు. కరోనా తో మరణించారేమోననే అనుమానంతో ఆమడ దూరం పోతున్నారు. ఇలా ఓ హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యాచకురాలు అనారోగ్యంతో చనిపోయింది. తన భార్య శవాన్ని శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్లను అడిగినా వారు రాలేదు. కరోనాతో చనిపోయి ఉంటుందేమోనని భయపడ్డారు. చాలా మంది అలాగే వెనకడుగు వేయడంతో చేసేది లేక తన భుజంపై భార్య శవాన్ని మోస్తూ మూడు కిలోమీటర్ల వరకు నడిచాడు. అక్కడ తన భార్య అంత్యక్రియలను పూర్తి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో నాగలక్ష్మి అనే మహిళ భిక్షాటన చేస్తూ ఉంటుంది. అనారోగ్యంతో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి భర్త స్వామి శవాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు సహాయం చేయమని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. ఆటోవాలాలను బతిమిలాడినా వారు కూడా నిరాకరించారు. కరోనాతో మరణించిందేమోననే అనుమానంతో అతడికి ఎవరూ సహాయం చేయలేదు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు, రైల్వే పోలీసులు రూ.2,500 సాయం చేశారు. వీటితో అంత్యక్రియలను చేయించుకోవాల్సిందిగా అతడికి చెప్పారు. దీంతో స్వామి తన భుజాలపై భార్య మృతదేహాన్ని మోస్తూ శ్మశాన వాటిక వరకు తీసుకెళ్లాడు. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు మోశాడు.
అతడు తన భార్య శవాన్ని మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మార్గమధ్యలో అతడు అక్కడక్కడ బిక్షాటన చేస్తూ తీసుకెళ్లాడు. రోడ్డుపై ఈ దృశ్యాలు చూసిన వారంతా అయ్యో పాపం కరోనా ఎంత ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చింది అని బాధపడ్డారు. కరోనా కారణంగా సొంత బంధువులే దగ్గరకు రాని పరిస్థితి ఏర్పడిందని స్వామి వాపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona dead boides, Crime news, Husband carries wife dead body, Kama reddy district, Man carries wife dead body, Wife dead body on shoulders