హర్యానా: రోజులు మారినా వరకట్నం విషయంలో కొందరి ఆలోచన ఏమాత్రం మారడం లేదు. అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ.. వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అత్తింటి ఆరళ్లకు కోడళ్లు బలవుతూనే ఉన్నారు. హర్యానాలోని భీవాని జిల్లాలో ఓ వివాహిత అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తన సూసైడ్ నోట్‌లో భర్త, అత్తింటి వారు పెట్టిన చిత్రహింసలను పూసగుచ్చినట్టు రాసి ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన విజయకుమార్ కూతురు నీతూ(24). నీతూకు, కమల్‌కు 2019, నవంబర్ 14న వివాహమైంది. పెళ్లయిన కొత్తలో భార్యను బాగానే చూసుకున్న కమల్ ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం కమల్‌తో పాటు అతని తల్లిదండ్రులు.. ఇతర కుటుంబ సభ్యులు నీతూను వేధించసాగారు. వేధింపులు ఎక్కువ కావడంతో కన్నవారితో తన కష్టాన్ని నీతూ చెప్పుకుంది. ఈ క్రమంలోనే.. మార్చి 24, 2021న నీతూ తల్లి, సోదరుడు ఆమె అత్తింటికి వెళ్లారు.
తమ కూతురిని ఇబ్బంది పెట్టవద్దని.. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇచ్చామని నీతూ తల్లి కమల్, అతని తల్లిదండ్రులకు గుర్తుచేసింది. అయినా.. అవేవీ పట్టనట్టుగా ప్రవర్తించిన కమల్.. నీతూ పుట్టింటి వారిని అవమానించి అక్కడ నుంచి పంపించేశారు. జూలై 29న నీతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. చాలా భయంగా ఉందని చెప్పింది. తండ్రి ఆమె దగ్గరకు వెళ్లేలోపే క్షణికావేశంలో విషం తాగింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసింది. అందులో మెట్టినింట్లో తను పడిన కష్టాలను ఏకరువు పెట్టింది.
లాక్‌డౌన్ కారణంగా తన భర్త ఉద్యోగం కోల్పోయాడని.. అప్పటి నుంచి తనకు వేధింపులు మరింత పెరిగాయని ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది. ‘ నేను వెళ్లిపోతున్నా.. నీకు తగ్గ అమ్మాయిని చూసుకో’ అని సూసైడ్ నోట్‌లో భర్తను ఉద్దేశించి నీతూ రాయడం గమనార్హం. నీతూ తండ్రి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురి మృతదేహాన్ని చూసి నీతూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 24 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయమ్మా అంటూ భోరున విలపించారు. ఆ కన్నవారి కడుపుకోతను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dowry harassment, Haryana, Married women, Wife suicide, Woman suicide