రైల్వే ట్రాక్. దాని పక్కనేవ ఓ మూట. దాని చుట్టూ కుక్కలు చేరి అరుస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న రైల్వే సిబ్బంది ఆ సీన్ ను చూశారు. వారికి అనుమానం వచ్చింది. అసలేంటో చూద్దామని దగ్గరకు వెళ్లి చూశారు. ఆ మూట అంతా రక్తపు మరకలతో నిండిపోయింది. అంతే వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు హడావిడిగా వచ్చారు. ఆ మూటలో ఏముందా అని ఓపెన్ చేసి చూశారు. అంతే ఒక్కసారిగా షాకయ్యారు. ఆ మూటలో ఓ మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్ని కూడా సగానికి నరికి రెండు భాగాలుగా చేసినట్టు ఉంది. ఆ దృశ్యం చూసిన పోలీసులకు సీన్ అర్థమయింది. ఎవరో చంపేసి గుర్తుపట్టకుండా ఉండేందుకే రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం నగరం సమీపంలోనే మల్లెమడగు రైల్వే ట్రాక్ పై కొందరు రైల్వే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం సాయంత్రం రైల్వే సిబ్బందికి రైల్వే ట్రాక్ పక్కన ఓ మూట కనిపించింది. కుక్కలు అరుస్తూ ఉండటంతో వారికి అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశారు. బస్తాకు రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆ మూటను ఓపెన్ చేసి చూశారు. దాంట్లో 35 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహం వారికి కనిపించింది. శవాన్ని రెండు భాగాలుగా చేసి మరీ మూటకట్టడం వారిని షాక్ కు గురిచేసింది. రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరో హత్య చేసి ఇలా సంచీలో మూటకట్టి మంగళవారం అర్ధరాత్రి రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పెదవి తెగి ఉండటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూటను రైల్వే ట్రాక్ మీద పెడితే రైలు ఢీ కొట్టడం వల్ల మృతదేహం రెండు భాగాలుగా అయిందా? లేక హంతకుడే రెండు భాగాలుగా చేశాడా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మార్చురీలో శవాన్ని భద్రపరిచినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నామని, త్వరలోనే కేసును పరిష్కరిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Published by:Hasaan Kandula
First published:January 21, 2021, 06:46 IST