(K.Lenin,News18,Adilabad)
ఏ తల్లి అయినా తన పిల్లలను కంటికి రెప్పలా పొట్టలో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ పిల్లలకు కష్టం రాకుండా పెంచుకుంటుంది. బిడ్డల పాదాలు చిన్న ముల్లు గుచ్చుకుపోతేనే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఆ కన్నతల్లికి ఏ కష్టం వచ్చిందో, కారణం ఏమిటో తెలియదు కాని కఠిన నిర్ణయమే తీసుకుంది. తన కడుపున పుట్టిన పిల్లలిద్దరికి ఉరివేసి తాను కూడా అదే ఉరిని బిగించికొని మృతి చెందిన ఘటన మంచిర్యాల(Mancherial)జిల్లాలో ప్రతి ఒక్కరిని కలచివేసింది.
బిడ్డలకు ఉరివేసి తాను..
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో సాయి కుమార్, ధనలక్ష్మీ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సమన్విత, సంకరమ్మ ఉన్నారు. ఇందులో ఒకరిది ఆరేళ్ల వయసు. మరొకరిది ఆరు నెలల వయసు. అయితే భవన నిర్మాణ కూలీగా పనిచేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్న సాయి కుమార్ ఎప్పటిలాగే కూలీ పనికి వెళ్లాడు. పనిపూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన సాయికుమార్ ఎంత పిలిచినా తన భార్య ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఏమై ఉంటుందని కిటికిలో నుండి చూశాడు. అయితే భార్య ఇద్దరు కూతుళ్ళు ఇంట్లోని దూలానికి వెలాడుతూ కనిపించడంతో వెంటనే ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు.
ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ..
అప్పటికే భార్య ధనలక్ష్మీతో పాటు ఇద్దరు కూతుళ్లు చనిపోవడంతో సాయి కుమార్ బోరున విలపించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సాయికుమార్‌కి అప్పులున్నాయని...అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ధనలక్ష్మి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.
ఆప్పుల బాధ భరించలేకే ..
మృతురాలు ధన లక్ష్మీ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం. బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు వలస వచ్చారు. అయితే ధనలక్ష్మీ, సాయి కుమార్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. కేవలం ఆర్దిక ఇబ్బందులతో పిల్లలతో కలిసి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త పుట్టినింటి వాళ్లకు తెలియడంతో రుయ్యాడిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.