ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ.. ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నరపాం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. తుమ్మికాపల్లికి చెందిన నల్లపురాజు గౌరి తన కుతూళ్లు శ్రీహాసిని(8), సంకీర్తన(6)లతో కలిసి గురువారం సాయంత్రం బయటకు వెళ్లింది. పిల్లలకు తినుబండరాలు కొనిచ్చి, అలా వాకింగ్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పింది. అయితే రాత్రి అయినా గౌరి ఇంటికి రాకపోవడంతో.. ఆమె భర్త శ్రీనివాసరాజు, ఇతర కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
గౌరి పిల్లలతో కలిసి వీరభద్రపురం వైపు వెళ్లిందని, వాకింగ్ కోసం వెదుళ్ల పైడితల్లమ్మ గుడి వరకు వెళ్లడం చూశామని గ్రామస్తులు గౌరి సోదరుడు ఆనంద్‌కు తెలిపారు. దీంతో ఆనంద్ ఆ ప్రాంతంలో రాత్రంతా వెదికాడు అయినా లాభం లేకపోయింది. ఇక, మరుసటి రోజు ఉదయం గౌరి, ఆమె ఇద్దరు పిల్లలు విసన్న చెరువులో శవాలుగా కనిపించడంతో.. స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక, చిన్నతనంలోనే గౌరి తండ్రి చనిపోవడంతోనే మేనమామ శ్రీనివాసరాజు ఆమె కుటుంబాన్ని ఆదుకున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం గౌరి, శ్రీనివాసరాజుల పెళ్లి జరిగింది. గౌరి కుటుంబంతోనే, ఆమె సోదరుడు, తల్లి నివాసం ఉంటున్నారు. అయితే ఫ్యామిలీలో ఎలాంటి వివాదాలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గౌరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.