దొంగలు దొరల్లా రావడం అంటే ఇదేనేమో. యజమానులు ఇంట్లో లేరని తెలిసి...తాను యజమాని బంధువునంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ అరగంటలోనే తన పని పూర్తి చేసుకుంది. మెల్లిగా జారుకోవాలని చూసింది. ప్లాన్ బెడిసి కొట్టడంతో చోరీ చేసి పారిపోతుండగా ఇంటి యజమానికి పట్టుకున్నాడు. ఊరంతా చూస్తుండగా మహిళ దొంగను చెట్టుకు కట్టేసి దోచుకున్న డబ్బు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఖమ్మం(Khammam)నగర శివారు ప్రాంతమైన రుద్రమకోట(Rudramakota)లో ఈ ఘటన జరిగింది.
దొరలా చొరబడ్డ దొంగ..
ఇళ్లలో దొంగతనాలు చేసే వాళ్లు సహజంగా తాళాలు పగలగొట్టుకొని చొరబడతారు. కాని ఖమ్మం నగరంలోని రుద్రమకోటలో పసుపులేటి శ్రీనివాస్ ఇంట్లో ఓ మహిళ బంధువుని అంటూ ఇంట్లో చొరబడి చోరీ చేసింది. ఇంటి యజమాని పసుపులేటి శ్రీనివాస్ ఆయన భార్య భవానీ వ్యవసాయ పనులకు పొలానికి వెళ్తూ ఇంటి తాళం కిటికీ పక్కనున్న గోడకు తగిలించారు. ఇది గమనించిన ఖిలాడీ లేడీ ఇంట్లో నగదు, నగలు ఎత్తుకెళ్లడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బంధువునని చెప్పి కిటిలోంచి తాళం తీసి లోపలికి చొరబడింది.
దేహశుద్ధి చేశారు..
చీర మార్చుకోవడానికి వచ్చానంటూ ఇంట్లోకి వెళ్లి నగలు, నగదు ఎత్తుకెళ్లింది. ఇది జరిగిన కొద్ది సేపటికే యజమాని ఇంటికి రావడంతో పక్క పోర్షన్‌లో ఉంటున్న శ్రీనివాస్ తండ్రి సైదులు ఎవరో బంధువునంటూ ఓ మహిళ వచ్చిపోయిందని చెప్పడంతో ఖంగుతిన్నాడు. ఇంట్లోకి వెళ్లి చూడగానే వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వచ్చిన మహిళ దొంగ అని నిర్ధారించుకొని బైక్‌పై అదే ప్రాంతంలో గాలించాడు. సొమ్ముతో పారిపోతున్న మహిళను పట్టుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలోనే చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. బంధువు పేరుతో ఇంట్లోకి చొరబడి చోరీ చేసిన మహిళ ముదిగొండ మండలం ఎడవల్లికి చెందిన వీరమ్మగా గుర్తించారు.
లేడీ ఖిలాడీ..
వీరమ్మ శ్రీనివాస్ ఇంట్లో దొంగిలించిన 90వేల నగదుతో పాటు చెవి పోగులు, రెండు ఉంగరాలు, వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఇంటి యజమాని భార్య చోరీ చేసిన మహిళను వివస్త్రను చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. చెట్టుకు కట్టేసిన సమయంలో మహిళను కాళ్లతో తన్నుతున్న వీడియోతో పాటు వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతున్నాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితురాలు చింతకాని మండలం రామకృష్ణాపురంలో కుమార్తె దగ్గర ఉంటోంది. అక్కడ ఉంటూనే ఈతరహా చోరీలు, దొంగతనాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Criminal women, Khammam