ఆన్లైన్లో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒకటే కావడంతో వారి మధ్య తక్కువ కాలంలోనే మంచి సఖ్యత ఏర్పడింది. అతను రూమ్‌కి రమ్మనడంతో ఒంటరిగా అక్కడికి వెళ్లిందామె. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో... బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో వెలుగుచూసింది. నెవార్క్ ఏరియాకు చెందిన 23 ఏళ్ల జానియా పీ స్టీవెన్స్... ఫేస్బుక్లో తెగ యాక్టివ్‌గా ఉండేది. అలా ఆన్లైన్లో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా... ఆ తర్వాత ప్రేమగా మారడంతో ఇద్దరూ కలుసుకోవాలని భావించారు. తాను ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్నారని, ఇక్కడే కలుసుకుందామని యువతిని డేటింగ్‌కు ఆహ్వానించాడు ఆ యువకుడు. దానికి ఆమె సరేనని ఒప్పుకుంది. అనుకున్నట్టుగానే ఆమె యువకుడి ఫ్లాట్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇద్దరి మధ్యా ఏదో విషయమై వాగ్వాదం మొదలైంది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన జానియా పీ స్టీవెన్స్... బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అతన్ని మూడు సార్లు పొడిచింది. తర్వాత రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆన్లైన్ ఫ్రెండ్‌ను అలాగే వదిలేసి వచ్చేసింది. అతికష్టం మీద ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేసిన యువకుడు... వారు తక్షణమై స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
అతని ఫిర్యాదుతో జానియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఏం జరిగిందని ప్రశ్నించగా ఆత్మరక్షణ కోసమే అలా చేశానని చెప్పింది. అతను తన గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని... అందుకే ఆత్మరక్షణ కోసం కత్తితో పొడిచి బయటపడ్డానని చెప్పింది. అయితే ఆమె గొంతుపై అలాంటి గాయాలేమీ లేకపోవడంతో జానియాపై హత్యయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు... అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.