తిరువన్నమలై: పెళ్లయి రెండు నెలలయింది. ఆ కొత్త జంట ఎంతో సంతోషంగా జీవిస్తోంది. కానీ.. ఎవరికి కన్నుకుట్టిందో ఏంటో కానీ మృత్యువు ఆ కొత్త జంట జీవితంలో విషాదం నింపింది. భార్యను భర్తకు దూరం చేసింది. ఏడడుగులు కలిసి నడిచిన భార్యను కాటికి సాగనంపాల్సిన పరిస్థితిని తలుచుకుని ఆ భర్త రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువన్నమలైలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువన్నమలై జిల్లా సీమంగుడి ప్రాంతానికి చెందిన మణికందన్ అనే యువకుడికి చెన్నైకి చెందిన గీతాప్రియ అనే యువతితో వివాహం జరిగింది. రెండు నెలల క్రితం ఈ జంటకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ చెన్నైలో నివాసం ఉంటున్నారు. పల్లవన్ గ్రామ బ్యాంక్‌లో మణికందన్, గీతాప్రియ ఉద్యోగం చేస్తున్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సెలవులు రావడంతో భార్యాభర్తలిద్దరూ కాంచీపురం వెళ్లాలనుకున్నారు. కారులో చెన్నై నుంచి బయల్దేరి వెళ్లారు. దారి మధ్యలో రంగసామి లేక్ దగ్గర కారు పార్క్ చేసి మెడిసిన్ కొనేందుకు భార్యాభర్తలు రోడ్డు పక్కన నడుచుకుంటూ మెడికల్ స్టోర్‌కు వెళుతున్నారు. ఇంతలో అటుగా ఓ కారు వేగంగా వెనుక నుంచి వచ్చి ఓ ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో కారు గీతాప్రియ మీదుగా దూసుకుపోయింది. పక్కనే నడుస్తున్న భార్యపై నుంచి కారు వెళ్లడంతో ఆ భర్తకు ఏం అర్థం కాలేదు. రోడ్డు పక్కన ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కారు కింద చిక్కుకున్న గీతాప్రియను ఆమె భర్త స్థానికులు సాయంతో బయటకు తీశాడు. వెంటనే హుటాహుటిన 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కాంచీపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
గీతాప్రియ తీవ్రంగా గాయపడటంతో చికిత్స చేస్తున్న సమయంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూస్తూ ఆ భర్త రోదించిన తీరు హాస్పిటల్లో ఉన్న వారిని కలచివేసింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఆ భర్త కుప్పకూలిపోయాడు. కాంచీపురం పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. కాంచీపురంలోని కుమార్ వీధికి చెందిన మదన్ అనే వ్యక్తి ఆ కారును నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఒక మనిషి నిర్లక్ష్యంగా కారును నడపటం వల్ల ఓ కొత్త జంట జీవితం చెల్లాచెదురైంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.