మాయమవుతున్నడమ్మ మనిషన్నవాడు… మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు..!! అంటూ ఓ సినీ కవి రాసిన తెలుగు సినిమా పాట అక్షర సత్యమనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. బంధాలు, అనుబంధాలు, విలువలకు తిలోదకాలిస్తూ తమదారి తాము చూసుకుంటున్నారు స్వార్థ మనుషులు. ఈ క్రమంలో కొంతమంది మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నతీరు వారిని కటకటాలపాలుజేస్తోంది. అయినా వారికి కనువిప్పు కలగడం లేదు. ఇలాంటిదే ఓ ఘటన నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ ఇల్లాలు ఏకంగా కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా కడతేర్చింది. ఈ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించడంతో ప్రియుడితో కలిసి కటకటాలపాలైందా ఇల్లాలు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అన్నట్లు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలానికి చెందిన అబ్దుల్ సయ్యద్ ఫైసల్, యాస్మిన్ బేగం భార్యాభర్తలు. ఫైసల్ పేయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతని భార్య యాస్మిన్ బేగంకు అదే గ్రామానికి చెందిన వ్యక్తి మహ్మద్ అథా ఉల్లా తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో అతడు మందలించాడు. పెద్దలకు ఫిర్యాదు చేశాడు. వారి ముందు అలాంటిదేమీ లేదని.. ఇకపై అలాంటి పని చేయబోనని మాయమాటలు చెప్పిన ఆమె.. తర్వాత గుట్టుగా అదే తీరు కొనసాగించింది. అది తెలిసిన భర్త తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతో అతడి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు ఆ భార్య, ప్రియుడు.
అందుకోసం పథకం పన్ని ఆ మేరకు ప్రియుడు మొహమ్మద్ అథావుల్లాతో కలిసి గత నెల 16న అబ్దుల్ సయ్యద్ ఫైసల్ హత్యచేశారు. 18న తెల్లవారు జామున శవాన్ని నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపెల్లి గ్రామశివారు జాతీయ రహదారి పక్కన ఆటోలో తీసుకవచ్చి పడేశారు. 25వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవం పోలీసులకు దొరికింది. మామడ ఎస్సై వినయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత ఈ కేసును సోన్ సీఐ జీవన్ రెడ్డికి అప్పగించారు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులుసీఐ నేర స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ఆధారాలతో నిజామాబాద్, కామారెడ్డి, మిస్సింగ్ కేసు వివరాలను తెప్పించి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు చెందిన సయ్యద్ పైసల్ పోలికలు సరిపోయాయి. దీంతో ఫిర్యాదురాలు యాస్మిన్ బేగంను పిలిచి విచారించారు. ఆమే ప్రియుడితో కలిసి హత్యచేసి ఏమీ ఎరగనట్లు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో తన భర్త కనబడటం లేదని ఫిర్యాదు చేసిన తనపై ఎవరైకి అనుమానం రాకుండా వ్యవహరించిందనే అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో నిందితురాలు నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ ఉపేందర్రెడ్డి తెలిపారు. దీంతో మృతుడి భార్య, ప్రియుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Murder, Nirmal, Telangana, Telangana News, Wife kill husband