WIFE KILLED HER HUSBAND LOVER WITH AN AX OVER A DISPUTE BETWEEN THEM IN MADHYA PRADESH FULL DETAILS HERE HSN
ప్రేయసితో భర్త ఎస్కేప్.. ఎక్కడున్నారో తెలిసి వెళ్లిన భార్య.. వారితోనే ఉండేందుకు డీల్.. చివరకు కథ అడ్డం తిరిగింది..!
ప్రతీకాత్మక చిత్రం
’ఆమె నన్ను నమ్ముకుని భర్తను వదిలేసి వచ్చింది. ఆమెను చూసుకోక తప్పదు. నువ్వు కూడా కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. హ్యాపీగా అంతా ఒకే చోట ఉండొచ్చు.‘ అని ఆ భర్త అనడంతో సరేనంది. ఆ తర్వాత..
ఓ భర్త తన భార్యను వదిలేసి కనిపించకుండా పోయాడు. భర్త ఎక్కడకు వెళ్లాడో తెలియక ఆ భార్య తెగ ఆవేదన చెందింది. చివరకు ఆమెకు ఓ దారుణ నిజం తెలిసింది. అదే ఊరికి చెందిన ఓ వివాహితను తీసుకుని వెళ్లిపోయాడనీ, ఆమెతో కలిసి సిటీలో కాపురం పెట్టాడని ఆమె గ్రహించింది. అంతే వెంటనే వాళ్లు ఉంటున్న చోటకు వెళ్లింది. భర్త, అతడి ప్రేయసితో గొడవ పడింది. నానా దుర్భాషలాడింది. మొదట భర్తతో గొడవ పెట్టుకున్నా, చివరకు అతడితోనే కాంప్రమైజ్ అయింది. ’ఆమె నన్ను నమ్ముకుని భర్తను వదిలేసి వచ్చింది. ఆమెను చూసుకోక తప్పదు. నువ్వు కూడా కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. హ్యాపీగా అంతా ఒకే చోట ఉండొచ్చు.‘ అని ఆ భర్త అనడంతో సరేనంది. కొన్నాళ్ల పాటు వారి ముగ్గురి కాపురం సజావుగానే సాగింది కానీ, చివరకు వారి బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ నగరం పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ నగరం పరిధిలోని ధీమర్ ఖేదా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 2020వ సంవత్సరం మే నెల 11వ తారీఖున నరేష్ భుర్మాన్ అనే వ్యక్తి తన భార్య రుక్మిణి కనిపించడం లేదంటూ కేసు నమోదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు అతడికి ఓ నిజాన్ని వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన పూరన్ సింగ్ అనే వ్యక్తితో వెళ్లిపోయిందని చెప్పారు. రుక్మిణి తన భర్త నరేష్ భుర్మాన్ తోపాటు ఇద్దరు పిల్లలను కూడా వదిలేసి పూరన్ సింగ్ తో వెళ్లిపోయిందన్న ప్రచారం ఊరంతా వ్యాపించింది. అయితే పూరన్ సింగ్ కు సాంబోబాయి తో అంతకుముందే పెళ్లయింది. అదే గ్రామంలో ఉంటోంది. తన భర్త నిర్వాకం గురించి తెలిసిన సాంబోబాయి వాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుంది.
జబల్పూర్ నగరంలో తన భర్త పూరన్ సింగ్, అతడి ప్రేయసి రుక్మిణి ఉంటున్నారని తెలిసి నేరుగా అక్కడకు వెళ్లింది. వారితో గొడవపడింది. తీవ్ర వాదులాట అనంతరం భర్తతో ఓ ఒప్పందానికి వచ్చింది. వారిద్దరితోపాటు ఆమె కూడా అక్కడ ఉండేందుకు ఒప్పుకుంది. కొన్నాళ్ల పాటు వాళ్లు ఆ నగరంలోనే ఒకే ఇంట్లో ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పనుల్లేక వాళ్లు ముగ్గురూ సొంతూరికి వచ్చారు. సొంతూరికి వచ్చిన తర్వాత రుక్మిణి మళ్లీ తన భర్త నరేష్ భుర్మాన్ తో కలిసి ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రుక్మిణి, సాంబోబాయి ఇద్దరూ కలిసి కట్టె పుల్లలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్లారు. ఆ క్రమంలో ఓ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవలో సాంబోబాయి తన వద్ద ఉన్న గొడ్డలితో రుక్మిణిపై దాడి చేసింది. ఆ దాడిలో రుక్మిణి అక్కడికక్కడే మరణించింది. వెంటనే సాంబోబాయి తన సోదరుడికి సమాచారం ఇచ్చి రుక్మిణి మృతదేహాన్ని దగ్గరలో ఉన్న మురికిగుంటలో పూడ్చేసింది. అయితే రుక్మిణి కనిపించకపోవడంతో మళ్లీ నరేష్ భూర్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపడితే చివరగా ఆమె సాంబోబాయితో కలిసి వెళ్లిందన్న సమాచారాన్ని కొందరు స్థానికులు ఇచ్చారు. సాంబోబాయిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేస్తే ఆమె ఎట్లకేలకు నిజం ఒప్పుకుంది. తానే హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో సాంబోబాయిని, ఆమె సోదరుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.